సోంపేట: సోంపేటలో మంగళవారం మధ్యా హ్నం మూడు గంటల నుంచి 5 గంటల వరకు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చెట్లు పడిపోవడంతో పాటు, విద్యుత్ వైర్లు నేలకొరిగాయి. మండలంలోని సాగుచేస్తున్న ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బెంకిలి, జింకిభద్ర, పలాసపురం, బారువ గ్రామాల్లో టమాటా సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట వర్షానికి తుడిచిపెట్టుకుపోవడంతో రైతన్న ముఖంలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా టమాటా పంట కొద్దిగా ధర పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు కనిపించాయి. పాడైపోయిన టమాటా పంటను ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మంగళవారం సాయంత్రం పరిశీలించి, రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరారు.


