కొత్తూరు : కూటమి ప్రభుత్వం చేసిన ఎస్సీల వర్గీకరణతో రెల్లి ఉప కులస్తులకు తీవ్ర అన్యాయం జరి గిందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రెల్లి ఉప కులస్తుల మండల సంఘం అధ్యక్షుడు దూళి అప్పన్న, జిల్లా ఉపాధ్యక్షుడు లోకొండ లక్ష్మణరావు, మండల నాయకులు దూలి మోహనరావు అన్నారు. కొత్తూరులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాల వారీగా కుల గణన చేసిన తర్వాతే ఎస్సీల వర్గీకరణ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా నేటికీ జిల్లాల వారీగా ఎస్సీ కుల గణన చేయకపోవడంతో రెల్లి ఉప కులాలు ఉద్యోగ, ఉన్నత విద్య, స్వయం ఉపాధి వంటివి పొందలేక తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. 85 శాతం మార్కులు సాధించినా రెల్లి ఉప కులస్తులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో తీరని నష్టం జరిగిందన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సాయం అందేదని తెలిపారు. కుల గణన జరిగే వరకు పాత పద్ధతిలోనే ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.


