ఎందుకో ఏమో..! | - | Sakshi
Sakshi News home page

ఎందుకో ఏమో..!

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

● సూర్యఘర్‌ పథకంపై జిల్లాలో విముఖత

● ఆశించిన స్థాయిలో దక్కని ఆదరణ

● అమలులో రాష్ట్రంలో జిల్లా 22వ స్థానం

● మల్లగుల్లాలు పడుతున్న అధికారులు

హిరమండలం : ప్రతి ఇంట్లో విద్యుత్‌ ఉత్పాదన పెంచేందుకు, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట ‘సూర్యఘర్‌’ పథకాన్ని ప్రారంభించింది. అయితే పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో విద్యుత్‌ వినియోగదారుల నుంచి పెద్దగా ఆసక్తి లేకుండాపోతోంది. దీంతో రాష్ట్రంలోనే పథకం అమలులో జిల్లా వెనుకబడి ఉంది. ఏకంగా 22వ స్థానంలో జిల్లా నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. కరెంట్‌ వినియోగంలో భారం తగ్గించేందుకుగాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మాత్రం స్పందన రావడం లేదు. లక్ష్యానికి చేరువ కాలేక విద్యుత్‌ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో అన్ని రకాల విద్యుత్‌ కనెక్షన్లు 8 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో ఇప్పటివరకూ 16,278 మంది మాత్రమే సోలార్‌ అమర్చుకున్నారు. రో జుకు అవసరం అయ్యే విద్యుత్‌ వినియోగం జిల్లా లో 30 వేల కిలోవాట్లుకాగా.. ఇప్పటివరకూ ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్‌ కేవలం 3,256 మెగా వాట్లు. ఇలాగైతే లక్ష్యానికి ఎప్పుడు చేరువకావాలంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాన ఆశించిన స్థాయిలో పథకంలో పురోగతి లేదు. ముందుగా పట్టణాలు, మేజర్‌ పంచాయతీల్లో సోలార్‌ ప్లాంట్ల అమరిక ప్రారంభించారు. ఆర్థికంగా స్థితిమంతులు, ఉన్నత శ్రేణి వర్గాల వారు మాత్రమే సోలార్‌ ప్లాంట్‌ అమర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలు అటువైపుగా చూడడం లేదు. తాము అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.

అందరూ అర్హులే..

సొంతిల్లుతో పాటు విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతిఒక్కరూ ఈ పథకానికి అర్హులే. దరఖాస్తుకు విద్యుత్‌ బిల్లు, ఆధార్‌, రేషన్‌ కార్డులు, బ్యాంకు అకౌంట్‌ వివరాలు, మొబైల్‌, ఇంటిపత్రాలు జతపరచాల్సి ఉంటుంది. విద్యుత్‌ కోతల బెడద ఉండదు. వినియోగం కంటే ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి అయితే తిరిగి విద్యుత్‌ శాఖకు విక్రయించుకోవచ్చు. ఒకసారి సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చుకుంటే పాతికేళ్ల వరకూ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.

అవగాహన కల్పిస్తున్నాం..

జిల్లాలో సూర్యఘర్‌ పథకం నత్తనడకన కొనసాగుతుండటం నిజమే. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో కట్టాల్సి ఉండటంతో వారు ఆసక్తి చూపడం లేదు. బ్యాంకు రుణాలు కల్పిస్తామని చెబుతున్నా ఇంకా అనుమానంతోనే ఉన్నారు. అయినా సరే మా ప్రయత్నాల్లో మేమున్నాం.

– జి.వి.ప్రసాద్‌, విద్యుత్‌ శాఖ డీఈ, పాతపట్నం

ప్రజల విముఖత..

ప్రతి కుటుంబం 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా పొందేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఇంటి పైకప్పు ప్రాంగణంలో సోలార్‌ పలకలు ఏర్పాటుచేసుకుంటే 40 శాతం వరకూ రాయితీ ఇస్తున్నారు. 3 కిలోవాట్స్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సోలార్‌ పలకలను అమర్చేందుకు రూ.1.40 లక్షల వరకూ ఖర్చవుతోంది. బ్యాంకుల్లో రుణ సౌకర్యం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు వినియోగదారులు ఆసక్తిచూపడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement