కుచించుకుపోతున్న ఆమదాలవలస పెద్ద చెరువు
పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు
ఆయకట్టు రైతుల ఆందోళన
ఒకప్పుడు 77
ఎకరాలు..
ఆమదాలవలస : పట్టణ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువ గల పెద్ద చెరువు (అంకమ్మ చెరువు) భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని అంతరించిపోతున్నాయని ఆదివారం ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఒకప్పుడు సుమారు 77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు, రాజకీయ అండదండలతో బడాబాబులు చుట్టుముట్టి ఆక్రమించుకోవడంతో ప్రస్తుతం కేవలం 25 ఎకరాలకు పరిమితమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెరువు భూమిలో ఆక్రమణలు కొనసాగుతూ పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నప్పటికీ, రెవెన్యూ, మున్సిపల్ అధి కారులు స్పందించకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 73లో ఉన్న ప్రభుత్వ చెరువు భూమిలో ఇటీవల ఒక వస్త్ర వ్యాపారవేత్త సుమారు 40 అడుగుల మేర మట్టిని నింపి స్థలం ఎత్తు చేసిన ఘటన స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. ఈ విషయం తెలుసుకున్న పాత ఆమదాలవలస గ్రామానికి చెందిన రైతులు సంఘటితమై అక్కడకు చేరుకొని నిరసన తెలిపారు. రైతులు ముద్దాడ జోగారావు, లావేటి సన్యాసిరావు, గొలివి పురుషోత్తం, పోగోటి మణికంఠ, అంబటి పోలినాయుడు, బండి శిమ్మయ్య ఆధ్వర్యంలో మరికొంతమంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 23 వార్డులలో 19 వార్డుల డ్రైనేజీ నీరు ఈ చెరువులోకి చేరుతోందని, పాత ఆమదాలవలస, కుద్ధిరాం, రావికంటిపేట, బొడ్డేపల్లి పేట ప్రాంతాలకు చెందిన సుమారు 100 ఎకరాల సాగు భూములు ఈ చెరువు నీటిపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కీలక వనరు రోజురోజుకూ ఆక్రమణలతో అంతరించిపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వందల కోట్ల విలువైన చెరువు భూమిని రక్షించాలని రైతులు డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి కార్యాలయాలకు ఫిర్యాదు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఆక్రమణలు తొలగిస్తాం
ఈ అంశంపై ఆమదాలవలస తహసీల్దార్ ఎస్.రాంబాబు స్పందిస్తూ, పెద్ద చెరువు భూములపై జరిగిన ఆక్రమణలపై మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, అక్రమాలను తొలగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


