పలాస: పలాస నెమలినారాయణపురం జాతీయ రహదారి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పర్లాకిమిడికి చెందిన అక్షయ (24), ముఖేష్ పాణిగ్రాహి (52), అమూల్య పాత్రో(52)లు భువ నేశ్వర్ నుంచి తిరుగు ప్రయాణంలో తన సొంతూరు పర్లాకిమిడికి ఇన్నోవా కారులో వస్తుండగా నెమలినారాయణపురం వద్ద సాయంత్రం 5.30 గంటలకు గాలి, దూళి, వర్షం కారణంగా కారు డివైడర్ మీదుగా అవతలి రోడ్డుకు వెళ్లి ఒక లారీని గుద్ది పక్క పొలాల్లోకి దూసుకు పోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముఖేష్ పాణిగ్రాహి, అక్షయలు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయారు. అమూల్య పాత్రో స్వల్పంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముఖేష్ పాణిగ్రాహి పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిఫర్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ సి.ఐ రామకృష్ణ చెప్పారు.


