శ్రీకాకుళం క్రైమ్ : భర్తకు కిడ్నీ వ్యాధి ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించేందుకొచ్చి ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. ట్రాఫిక్ సీఐ వి. రామారావు తెలిపిన వివరాల మేర కు.. లావేరు మండలం వెంకటపురానికి చెందిన అంధవరపు మార్కండేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందా రు. భార్య జయలక్ష్మి(70), వివాహాలైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. లావేరు పరిధిలోనే ఫెర్టిలైజర్ షాపు నడుపుతున్నారు. మార్కండేయులకు కొంతకాలంగా కిడ్నీ వ్యాధి ఉంది. శుక్రవారం డయాలసిస్ నిమిత్తం నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి భార్య జయలక్ష్మి తీసుకొచ్చింది. మార్కండేయులును ఐసీయూలో ఉంచడంతో ఎవరూ ఉండకూడదన్న నిబంధనతో ఆమదాలవలసలోని తన సోదరి కుమార్తె ఇంటికి జయలక్ష్మి శుక్రవారం రాత్రి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం ఆమదాలవలసలో పల్లె వెలుగు బస్సులో శ్రీకాకుళం చేరి కాంప్లెక్సులో దిగింది. నడుచుకుంటూ నాన్‌స్టాప్ బస్సులు, ఆటోస్టాండ్ మధ్య ఖాళీ స్థలం వైపు వెళ్తూ ఆగింది. ఔట్‌గేట్ వైపుగా వస్తున్న అదే పల్లెవెలుగు బస్సు వృద్ధురాలిని గమనించక పైనుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని అంబులెన్సులో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్‌ఐ దండపాణి దాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


