● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం: జిల్లాలోని 1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నగరంలోని 44వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఏవై గ్రామీణ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏప్రిల్ నెలలో నిధులు వస్తాయని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు సత్వరమే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణమన్నారు. పట్టణ హౌసింగ్ స్కీం కింద ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఈఈడబ్ల్యూడీసీ డైరెక్టర్ పీఎంజే బాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ రమాకాంత్, గృహ నిర్మాణ శాఖ పీడీ డి.రమాకాంత్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పైడిశెట్టి జయంతి, డీఈ సత్యాజీ, ఏఈ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.


