శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. కెప్టెన్, స్టార్ ఆటగాడు ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో 388 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. విజయనగరం జిల్లాలోని ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఏసీఏ అంతర్‌జిల్లాల సీనియర్స్ పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో మంగళవారం తూర్పుగోదావరి జిల్లాతో శ్రీకాకుళం తలపడింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తూ.గో. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. జిల్లా జట్టులో సాయియశ్వంత్, ఎన్.హిమకర్ తలా రెండు వికెట్లు, నంబళ్ల సుశాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. భారీ లక్ష్యసాధనతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జిల్లా 48.4 ఓవర్ల 391 పరుగులు సాధించి ఔరా అనిపించింది. ప్రసాద్ 59 బంతుల్లోనే 146 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సిక్కోలును విజయపథంలో నిలిపాడు. బెందాళం సాత్విక్ 70 బంతుల్లో 84 పరుగులు, కె.సాయిసాత్విక్ 71 బంతుల్లో 78 పరుగులతో రాణించారు. జట్టు రికార్డు లక్ష్యసాధన పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, ప్రధాన కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంఘ ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.
ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్
బి.సాత్విక్
సాయిసాత్విక్


