పాతాళానికి భూగర్భ జలాలు..
పంచాయతీలదే బాధ్యత
వినియోగంలోకి తేవాలి
● మూగజీవాలకు దప్పిక తిప్పలు
● అడుగంటుతున్న చెరువులు, వాగులు
● నిరుపయోగంగా నీటి తొట్టెలు
● పట్టించుకోని అధికారులు
ఇచ్ఛాపురం రూరల్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు పాడి రైతుల్లో ఆందోళన మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలో పలు చెరువులు, వాగులు, కుంటలు ఎండిపోవడంతో మూగజీవాలకు నీటిని అందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాడి రైతులు, కాపరిలు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 16,80,000కు పైగా పశువులు ఉన్నాయి. గొర్రెలు, మేకలు మేపుకుంటూ 70 వేలకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నెల రోజుల వరకు వరకు బాహుదా, మహేంద్రతనయా నదులతో పాటు చెరువులు, బావుల్లో నీరు ఉండటంతో మూగజీవాల దాహార్తి తీర్చుకునేవి. వేసవికా లం ప్రారంభం కావడంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో తాగేందుకు నీరులేక పశువు లుఅల్లాడిపోతున్నాయి.
సంతల్లో విక్రయం..
జిల్లాలో ఒకప్పుడు చాలా ఇళ్ల వద్ద పశువుల శాల, తోటల్లో మేకలు, గొర్రెల మందల శాలలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పశువులకు మేతతో పాటు అవి తాగేందుకు నీరు లేకపోవడంతో పాడి రైతులు వ్యాపారులకు సంతల్లో పశువులను విక్రయిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిర్మించిన తొట్టెల్లో పశువులు తాగేందుకు అవసరమైన నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం–పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో ‘పల్లె పండగ 2025–26 పశువుల నీటి తొట్టె’ పేరిట గత ఏడాది ప్రతీ గ్రామంలో తొట్టెలు నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు చేసేందుకు స్థానిక టీడీపీ కార్యకర్తల్ని పురమాయించి ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.34వేలు చొప్పున అందజేసింది. దీంతో ఒక్కో మండలానికి లక్షల రూపాయలు కేటాయించారు. చాలా ప్రాంతాల్లో పశువులు సంచరించని కొబ్బరి తోటలు, గోర్జిలు, ఆలయాలు వద్ద తొట్టెలు నిర్మించి చేతులు దులుపుకున్నారు. వాటి నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారాయి.
జిల్లాలో బాహుదానది, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, చంపావతి, సువర్ణముఖి, వేగావతి వంటి తదితర నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేస్తుండటంతో పాటు ఎండల తీవ్రత అధికం కావడంతో నదుల్లో నీరు ఇంకిపోతోంది. చెరువులు, కుంటలు, బోరు బావుల్లో నీరు పాతాళానికి చేరుకుంటోంది. దీంతో పశువుల కాపరులు, రైతులు కొన్నిచోట్ల వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన జింకలు, ఎలుగుబంట్లు సైతం నీటి కోసం గ్రామాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి.
మూగజీవాలకు వేసవిలో తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతి మండలంలో పశువులు సంచరించే ప్రదేశాల్లో నీటి తొట్టెల నిర్మాణం జరిగింది. తొట్టెల్లో నీరు లేదంటూ చాలా మంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలదే. మరో మారు పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసి తొట్టెల్లో నీరు నింపేందుకు చర్యలు తీసుకుంటాం
– చల్లా శ్రీనివాసరెడ్డి, ఉపాధి ఏపీడీ
మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో చెత్తా చెదారంతో నిండిపోయాయి. అధికారులు పర్యవేక్షించడం మానేశారు. వేలాది రూపాయలతో నిర్మాణం చేసిన తొట్టెలు కేవలం కూటమి నాయకులకు కాసుల పథకంగా మిగిలిపోకముందే తొట్టెల్లో నీటిని నింపి మూగ జీవాల దాహర్తిని తీర్చాలి.
– కారంగి మోహనరావు, మాజీ ఎంపీపీ, ఇచ్ఛాపురం


