సర్వేలతో చచ్చిపోతున్నాం..!
గతమెంతో ఘనం...
ఆత్మగౌరవం కాపాడాలి
● భారం మోయలేకపోతున్నామని సచివాలయ ఉద్యోగుల ఆవేదన
● ఏకంగా 32 రకాల సర్వేల నిర్వహణలో బిజిబిజీ
● పనిఒత్తిడితో ఇప్పటికే పలువురి ఆత్మహత్య
అరసవల్లి:
‘‘సచివాలయాలు శుద్ధ దండగ.. అసలు వాళ్లు ఉద్యోగులేనా.. ఎందుకూ పనికిరారు..’’ ఇవీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు.
‘‘సచివాలయాలు దరిద్రాలయాలు..’ ఇవీ స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల దుర్భాషలు..
ఇక చోటామోటా నేతల తిట్ల దండకం సరేసరి.
కానీ..సచివాలయాల్లో ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ ప్రచారావసరాలకు కావాలి. వారినే ఇంటింటికీ పంపించాలి. ఎడాపెడా సర్వేలు చేయించుకుని ప్రభుత్వ ప్రగతి అంటూ ప్రగల్భాలు పలకాలి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అంటూ సచివాలయాల పేర్లు మార్చిన ప్రభుత్వం ఉద్యోగుల విధులను సైతం అస్తవ్యస్తంగా మార్చేసింది. ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి మరీ ఒత్తిడి తెచ్చి సర్వేలు చేయించుకుంటోంది. ఈ ఒత్తిడి భరించలేక కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేస్తే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడి తనవు చాలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ట్విట్టర్ క్యాంపెయిన్ సమాచారం మేరకు 2024 సెప్టెంబర్ నుంచి ఈ నెల 10వ తేది లోపు 70 మంది ప్రాణాలు కోల్పోయారని సంఘం సభ్యులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే రెండు మరణాలు సంభవించగా...వివిధ కారణాలు చూపి పదుల సంఖ్యలో రాజీనామాలు చేసేశారు.
ప్రతి నెలా సర్వేలు...టార్గెట్లు!
సచివాలయ పరిధి విధులతో పాటు అదనంగా పదుల సంఖ్యలో సర్వేలు చేయడంపై ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి నెలా ఏకంగా 32 సర్వేలను చేయడం టార్గెట్‌గా పెట్టారు. ప్రధానంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వే, పీఎం కిసాన్ డ్రోన్స్ ఓబురేషన్ సర్వే, ఎన్‌సీడీసీ సర్వే, ఇ– క్రాప్ బుకింగ్ సర్వే, ఎఫ్‌ఎం సర్వే, ఆధార్ సర్వే, కౌశలం సర్వే, మనమిత్ర ద్వారా అందిస్తున్న 564 సేవలపై సర్వే, కొత్త రేషన్ కార్డుల సర్వే, బయోమెట్రిక్ అప్‌డేషన్ సర్వే, పి–4, పాస్‌బుక్స్ సర్వే, ఏహెచ్‌ఎస్ సర్వే, అభ సర్వే, సెమి ఆర్ఫన్ సర్వే తదితర 32 రకాల సర్వేలతో పాటు నెలవారీ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, ఆఖరికి బూత్‌లెవల్ ఆఫీసర్ల (బీఎల్‌ఓ) బాధ్యతలు వీరికే అప్పగించారు. దీనికితోడు ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో తిట్లు, చీవాట్లు నిత్యకృత్యం.
షోకాజ్ నోటీసులు..
ఓ వైపు సర్వేల ఒత్తిడి, మరో వైపు విధుల నిర్వహణతో సతమతమవుతూనే ఎప్పటికప్పుడు ప్రగతినివేదికలను అందిస్తున్నా చిన్నపాటి కారణాలు చూపిస్తూ, ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అవుతున్నాయి. గత నెలలో జిల్లాలో 564 మందికి షోకాజ్ నోటీసులివ్వడం గమనార్హం. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో సచివాలయ ఉద్యోగుల శాఖ మినహా మిగతా 56 ప్రభుత్వ శాఖల ఉద్యోగుల అవినీతి ప్రస్తావన రావడం లేదని, షోకాజ్‌లు, సస్పెన్షన్ల ఊసే లేదంటూ కొందరు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అర్హత పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల మందికి సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 6880 మంది ఉద్యోగులు విధుల్లో చేరారు. వీరికి అనుసంధానంగా వలంటీర్ల వ్యవస్థ కూడా అమలు చేయడంతో వలంటీర్ల ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలు, గుర్తింపు, లబ్ధిని కూడా ఇంటింటికీ అందించేవారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేయడంతో పాటు ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడి లేకుండా విధుల నిర్వహించుకునేవారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేసి వారి విధులన్నీ సచివాలయాల ఉద్యోగులకు అప్పగించేశారు. దీంతో పనిభారం ఎక్కువైంది.
సచివాలయ ఉద్యోగులంటే ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోంది. సర్వేల పేరిట ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఎవరికి నచ్చినట్లు వారు తిడుతున్నారు. కనీస గౌరవం ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారు. గత సెప్టెంబర్ 1 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరికలు చేశా. అయితే సర్వేలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ మరింత పెంచారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల మరణాలపై విచారణ కమిషన్ వేయాలి.
– కూన వెంకట సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి, శ్రీకాకుళం
సర్వేలతో చచ్చిపోతున్నాం..!


