శైవక్షేత్రాల్లో బందోబస్తుపై సమీక్ష
శ్రీకాకుళం క్రైమ్ : మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాల్లో పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం విశాఖ ఐజీ గోపినాథ్ జెట్టి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఎస్పీ మాట్లాడుతూ క్యూలైన్లు, పార్కింగ్ తదితర అంశాలను వివరించారు. గంజాయి రవాణా, ఎన్డీపీఎస్ చట్టం, సైబర్‌క్రైమ్, సోషల్ మీడియా, శాంతిభద్రతలపై ఐజీ ఆరా తీశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పాత్రిని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పకడ్బందీగా శివరాత్రి ఏర్పాట్లు
జలుమూరు: శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న శివరాత్రి ఉత్సవాలలో భక్తులకు అందించే ప్రసాదాల్లో నాణ్యత లోపిస్తే అధికారులు, నిర్వాహకులపై చర్యలు తప్పవని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత హెచ్చరించారు. గురువారం శ్రీముఖలింగం ఉత్సవ ఏర్పాట్లు పరీశీలించారు. ఈ ఏడాది అర్చక సంఘం, ఆలయ పాలక మండలి సంయుక్తంగా ప్రసాదాల అమ్మకాలు బాధ్యత తీసుకున్న నేపథ్యంలో శుచి, శుభ్రత విషయంలో రాజీపడవద్దన్నారు. సామాన్య భక్తులకు సులువుగా దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 18న జరగనున్న స్వామివారి చక్ర తీర్థస్నానాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏసీ ప్రసాద్ పట్నాయక్, పరిశీలకుడు ప్రసాద్, ఈఓ కె.ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


