తొలగిస్తున్న ఆక్రమణలు ఎవరివో అందరికీ తెలుసు
పలాస : పలాస నియోజకవర్గంలో భూ ఆక్రమణలు జరుగుతున్న మాట వాస్తవమేనని, అవన్నీ ఎమ్మెల్యే వెనుక ఉన్న దొంగలవేనని, అందుకు ఉదాహరణే కాశీబుగ్గ జగన్నాథసాగరం ఆక్రమణలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చెప్పారు. పలాస ఉల్లాసపేటలోని వేంకటేశ్వర దేవాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తొలగిస్తున్న ఆక్రమణలు ఎవరివో వారికే తెలుసని, ఇప్పటి వరకు తమ పార్టీ కార్యకర్త ఆక్రమణ అంటూ ఒక్కటైనా తొలగించారా అని ప్రశ్నించారు. తాను అద్దం లాంటి వాడినని, మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తానన్నారు. ప్రతిసారీ నల్లబొడ్లూరు కొండ అంటారని, ఆ కంకర వెంకన్న చౌదరి తవ్వి నాకు డబ్బులు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. అక్రమ కంకర తవ్వకాలపై సాక్షాత్తు పలాస తహశీల్దారు అధికారుల సమక్షంలోనే తాము అడ్డుకుంటే వెంటనే ఫోన్ వస్తుందని, తాము ఏం చేస్తామని మొరపెట్టుకోలేదా అని అన్నారు. ఆ ఫోన్ చేసిన నాయకుడిపై ఇంతవరకు చర్యలు లేవన్నారు. తన హయాంలో కబ్జా అని నిరూపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కూటమి హయాంలోనే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయని, తమ ప్రభుత్వం వస్తే ఒక్కటి కూడా ఉంచబోమని హెచ్చరించారు. సీతమ్మగుడి వద్ద వంశధార కాలువ గట్టును మింగేసి రోడ్డు వేశారని, కంబిరిగాం బ్రిడ్జి వద్ద లాండ్ సీలింగ్ యాక్టు అతిక్రమించి లేఅవుట్లు వేస్తున్నారని, వాటిపై సమాధానం చెప్పాలన్నారు. తనతో వస్తే ఎవరు ఆక్రమణలకు పాల్పడుతున్నారో చూపిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు హనుమంతు వెంకటరావు, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు ఉంగ సాయికృష్ణ, పైల చిట్టి, బమ్మిడి దుర్యోధనరావు, బోర బుజ్జి, పాలిన శ్రీనివాసరావు, మందస ఎంపీపీ డొక్కర దానయ్య, లీలారాణి, శిష్టు గోపి, దువ్వాడ రవి, నర్తు వెంకటరమణ, బమ్మిడి సంతోష్‌కుమార్, మల్లా సురేష్‌కుమార్, మల్లా భాస్కరరావు, పి.గురయ్యనాయుడు, ఇరోతు మోహనరావు, తిర్రి రాజారావు, డల్లి జానకి రెడ్డి, దున్న హరి, సొర్ర ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు


