ఆధ్యాత్మిక కేంద్రంగా హనుమాన్ ఆలయం
నరసన్నపేట: వంశధార నది ఒడ్డున మడపాం వద్ద విశ్వవిరాట్ హనుమాన్ ఆలయం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆలయం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే ఎత్తయిన ఆంజనేయ విగ్రహంగా మడపాం వద్ద అభయాంజనేయ స్వామి విగ్రహానికి పేరుందన్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం శ్రీరామ భక్త హనుమాన్ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు కార్యక్రమంలో నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళి, ఆలయ కమిటీ ప్రతినిధులు తంగుడు జోగారావు, సదాశివుని కృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు రాజాపు అప్పన్న, ఎంపీటీసీ రువ్వ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.


