ఓటు హక్కు సామాజిక బాధ్యత
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటు హక్కును సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.వి.లక్ష్మణమూర్తి అన్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా కళాశాలల విద్యార్థులతో కలిసి శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి నుంచి బాపూజీ కళామందిర్ వరకు ఓటు హక్కు మన జన్మ హక్కు అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్ వేదికగా జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం నిర్వహించి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అమూల్యమైనదని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు సైతం వినియోగించుకోవాలన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం వక్తృత్వం, వ్యాసరచన, ముగ్గుల పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందజేశారు. ముగ్గురు సీనియర్ సిటిజన్లు, ముగ్గురు దివ్యాంగులను సత్కరించారు. నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత ఆర్.శంకరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు, టీడీపీ నేత పి.ఎం.జె.బాబు, కాంగ్రెస్ నాయకురాలు ఈశ్వరమ్మ, నెహ్రూ యువ కేంద్రం (మై భారత్) డీడీ ఉజ్వల్, కలెక్టర్ కార్యాలయ సి–సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, సైకియాట్రిస్ట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


