మరోసారి టెట్ నిర్వహించాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాబోయే డీఎస్సీ ముందు టెట్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ టెట్–2025 పరీక్ష పేపర్ గత సంవత్సరాలతో పోల్చితే అత్యంత కఠినంగా ఉందని, అనేక మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నలు వల్ల 37 శాతం మాత్రమే క్వాలిఫై అయ్యారని, సుమారు లక్షన్నర మంది రోడ్డున పడ్డారన్నారు. 2026 డీఎస్సీ ప్రకటించే ముందు మరోసారి టెట్ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమం సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు రామోజీరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


