పీఆర్‌సీ కమిషన్ నియమించాలి
శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్‌సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో ఎస్‌టీఏ జిల్లా అధ్యక్షుడు సప్పటి మల్లేసు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, జనవరి నుంచి మరొక డీఏ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. న్యాయంగా రావాల్సిన డీఏలు సకాలంలో అందక ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. సరెండర్ లీవ్ బిల్లులు చెల్లించాలని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పంచాది గోవిందరాజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడిశెట్టి సాయిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరిపురం మురళి, తదితరులు పాల్గొన్నారు.


