చెత్త ఉంటే దుకాణం సీజ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం కాంప్లెక్స్ వద్ద పలు దుకాణాల పక్కనే పెద్ద ఎత్తున చెత్త పేరుకుని ఉండటాన్ని తాను స్వయంగా చూశానని, పారిశుద్ధ్య పరిస్థితి మారకపోతే దుకాణాలను వెంటనే సీజ్ చేయాలనికలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల పనితీరులో వేగం పెంచాలన్నారు. కీలక పనితీరు సూచికలు ఆధారంగా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన, ప్రయాణికుల రక్షణ అంశాలలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంపై అధికారులను కలెక్టర్ అభినందించారు. అయితే బస్టాండ్లలో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి కీలక అంశాలు బాగా మెరుగుపడాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్‌కుమార్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


