వనం.. ఆక్రమణం
రణస్థలం/ఎచ్చెర్ల:
ఎచ్చెర్ల మండలం కొయ్యాం పరిధిలో 62 ఎకరాల అటవీ భూమిపై బీజేపీ నాయకుడి కన్ను పడింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి తన పబ్బం గడుపుకుంటున్న ఆ నాయకుడిపై స్థానికులంతా ఏకమై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. కొయ్యాం రెవెన్యూ పరిధిలో 62 ఎకరాలు ఒక బీజేపీ నాయకుడు ఆక్రమించుకున్నాడని అదే గ్రామానికి చెందిన మజ్జి దామోదరావు, గణేష్, విజయకుమార్‌తో పాటు మరికొందరు హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు వెంటనే ఆ భూములను సర్వే చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో కదిలిన రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సోమవా రం సంయుక్తంగా పరిశీలించారు. ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అటవీ భూములను సర్వే చేశారు. కొబ్బరి తోటలను పరిశీలించి సరిహద్దు గుర్తింపునకు కార్యాచరణ చేపట్టారు. మరో రెండు రోజులు సర్వే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రౌడీ మూకలతో బెదిరింపు
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొయ్యం గ్రామ పరిధిలో ఆక్రమణలు జరిగిన భూములను సర్వే చేయాలని నవంబర్ 14న ఆదేశాలు వచ్చాయి. ఆ రోజు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. అయితే ఆ సమయంలో పిటీషనర్లు సర్వే దగ్గరకు వెళుతుండగా మార్గమధ్యంలో ఇక్కడ నుంచి మీరు వెనక్కి వెళ్లకపోతే మీ అంతు చూస్తామని ఆ బీజేపీ నాయకుడు బెదిరించారు. దీంతో భయపడిన పిటీషనర్లు ప్రాణాలు కాపాడుకోవడానికి వెనక్కి వచ్చి 15వ తేదీన ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి పోలీసులు రశీదు ఇచ్చి వెళ్లమన్నారే తప్ప ఆక్రమణదారుడిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ తంతునంతా హైకోర్టుకు నివేదించడంతో మళ్లీ డిసెంబర్ 8న పిటీషనర్ల సమక్షంలో సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటీషనర్లు మజ్జి దామోదరరావు, విజయకుమార్, నిమ్మ బొడెప్పడు, రాకోటీ చండీశ్వరరావుతో పాటు రాకోటి రాంబాబు సోమవారం సర్వేకు హాజరయ్యారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం..
కొయ్యాం రెవెన్యూ పరిధిలోని 62.37 ఎకరాల్లో నోటిఫైడ్ రిజర్వ్ అటవీ భూములు ఉన్నాయి. ఈ భూములు ఆక్రమణకు గురయ్యాయి. 2016లో రిట్ పిటీషన్ వేశారు. కొబ్బరి మొక్కలు వేసి ఆక్రమణకు పాల్పడుతున్నట్లు అప్పట్లో అటవీ శాఖ అధికారులకు తెలియపరిచి నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నెల 14న ఇలానే సర్వేకి వస్తున్న సమయంలో పిటీషనర్లను బెదిరించారు. ఒక వ్యక్తి దగ్గర ఇన్ని ఎకరాలు ఆక్రమణలో ఉండటం సరికాదని పేద ప్రజలకు ఇచ్చినా బతుకుతారనే ఉద్దేశంతో పిటీషన్ వేసినట్లు వారు తెలిపారు.
కొయ్యాం పరిధిలో 62 ఎకరాల అటవీ భూమి ఆక్రమించుకున్న బీజేపీ నాయకుడు
హైకోర్టు ఆదేశాలతో సర్వే చేస్తున్న రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు
హైకోర్టులో రిట్ వేసిన స్థానికులు
తప్పని పరిస్థితుల్లో కదిలిన యంత్రాంగం
హైకోర్టు ఆదేశాలతోనే..
తహసీల్దార్ గోపాల్, అటవీ శాఖ రేంజర్ రౌతు రాజశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం కొయ్యాం రెవెన్యూ పరిధిలో 427, 431 సర్వే నంబర్లలో ఆక్రమణ జరిగిందని, సర్వే చేయాలని హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. నోటీసుల ప్రాప్తికి అటవీ శాఖ, రెవెన్యూ అధికారులం సంయుక్తంగా పరిశీలించి సమగ్ర నివేదికను తయారు చేసి హైకోర్టుకి అందజేస్తాం. చాలా కాలం నుంచి ఇక్కడ భూములు ఆక్రమణ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ భూముల్లో రోడ్లు, తోటలు వేసి ఉన్నారు. – రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు
వనం.. ఆక్రమణం


