ఎనిమిది చోరీలు
ముగ్గురు యువకులు..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని దేవాలయాల్లో రాత్రి పూట చోరీలు చేసిన ముగ్గురు టీనేజీ యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. గార పోలీస్‌స్టేషన్ పరిధిలో 3, శ్రీకాకుళం రూరల్‌లో 3, ఒకటో పట్టణంలో 1, నందిగాం పీఎస్ పరిధిలో ఓ చోట కలిపి మొత్తం 8 చోరీల్లో రూ.1.72 లక్షల విలువైన 654.46 గ్రా ముల వెండి, 30 కిలోల కంచు, 2 కిలోల రాగి వస్తువులు వీరు దొంగిలించారు. బుధవారం మధ్యా హ్నం రూరల్ ఎస్‌ఐ కరక రాముకు ద్విచక్రవాహనంపై యువకులు వెళ్తున్నారన్న సమాచారం రావడంతో అంపోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద సిబ్బందితో మాటు వేసి పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం డీఎస్పీ సీహెచ్ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇవే చోరీలతో సంబంధమున్న మరో యువకుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
పదో తరగతిలో వ్యసనాలు.. మైనర్లుగా చోరీలు..
శ్రీకాకుళం మండలం కల్లేపల్లి పంచాయతీ జాలారిపేటకు చెందిన ఎరుపల్లి అశోక్ (20), గార మండలం బలరాంపురానికి చెందిన చోడిపల్లి వంశీ(20) పదోతరగతి వరకు కలసి చదివారు. చెడు వ్యసనాల బారిన పడ్డారు. చేతి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో మైనర్‌గా ఉన్నప్పుడే 2021 నుంచి అశోక్ చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. ఏకంగా 9 చోరీలు చేశాడు. ఆమదాలవలసలో ద్విచక్రవాహనాల చోరీ కేసులో జైలుకు వెళ్లడంతో అక్కడ ఆమదాలవలస తోటాడ గ్రామానికి చెందిన బెండి శివప్రకాష్(22) పరిచయమయ్యాడు. శివప్రకాష్ కూ డా మైనరుగానే ఉన్నప్పుడు 2021లో చోరీలు మొదలుపెట్టి జిల్లాలో ఐదు చోరీలు చేశాడు. జైలు నుంచి జనవరిలో విడుదలైన అశోక్, శివప్రకాష్‌లు బయట ఉన్న వంశీ, మరో యువకుడితో కలసి చోరీల బాట మళ్లీ పట్టారు.
షిరీడీ సాయిబాబా ఆలయంలో చోరీ..
శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగళ్లవానిపేట షిరిడీ సాయిబాబా ఆలయంలో ఈ ఏడాది జూలై 26న గుర్తు తెలియని వ్యక్తులు వెండి కిరీటాలు, ఇత ర వస్తువులు చోరీ చేయడంతో చింతపల్లి గోపాలకృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఏఎ స్పీ పి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ రాము దర్యాప్తు మొదలుపెట్టారు. యువకులపై అనుమానం రావడం బుధవారం పట్టుకున్నారు. గురువారం రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ. 1.71 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఆలయాల్లో దొంగతనం చేస్తున్న ముగ్గురు టీనేజర్ల అరెస్టు
పదో తరగతిలోనే వ్యసనాలు.. మైనర్లుగా చోరీలు
రూ.1.71 లక్షల విలువైన వెండి, ఇత్తడి, రాగి కంచు వస్తువులు స్వాధీనం


