ముక్కు, చెవులు కోసేశారు
● బంగారం దోచుకుని చంపేశారు
● మురపాక వృద్ధురాలి హత్యపై డీఎస్పీ ప్రకటన
శ్రీకాకుళం క్రైమ్/రణస్థలం: లావేరు మండలం మురపాక గ్రామంలో వడ్డీ పార్వతి అనే వృద్ధురాలు హత్యకు గురై బుధవారం బావిలో శవమై తేలిన విషయం పాఠకులకు విదితమే. ఆవులు మేపేందుకు కళ్లం వద్దకు వెళ్లిన వృద్ధురాలిని ఓ ప్రాంతంలో చెవులు, ముక్కు కోసి మరీ బంగారం దోచు కున్నారని, మరో ప్రాంతంలో చంపారని, చివరికి నిర్మానుష్య ప్రాంతంలో, పాడుబడిన బావిలో శవాన్ని పడేశారని డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు. ఇంటి నుంచి కళ్లానికి ఒక కిలోమీటరు, అక్కడి నుంచి పాడుబడిన బావికి ఒక కిలోమీటరే దూరమని అంతా అక్కడే జరిగిందన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సమీపంలో శనగ చేనుందని, శవాన్ని కాల్చేందుకు కూడా ప్రయత్నించి ఉండవచ్చని, పాడుబడిన బావి ఉన్న విషయం ఎవరికీ తెలియకపోవడంతో అక్కడ పడేశారన్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
పేకాట బాబుల పనేనా..?
ఘటన జరిగిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుందని, రణస్థలం, శ్రీకాకుళం టౌన్, ఎచ్చెర్ల, లావేరు పరిధి నాలుగైదు బ్యాచ్‌లు నిత్యం గంజాయి, మ ద్యం సేవిస్తుంటారని స్థానిక సమాచారం. హత్యకు గురైన వృద్ధురాలు సైతం పేకాట ఆడే బ్యాచ్‌లను రెండు మూడు సార్లు ఆడవద్దని హెచ్చరించినట్లు డీఎస్పీ వివేకానంద విలేకరులకు తెలిపారు. హత్య వెనుక వారి హస్తం ఉందా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.
సింహద్వారం నుంచి ఎటువెళ్లినట్లు..
ఎచ్చెర్ల కేశవరావుపేట జంక్షన్ సమీపంలో బుధవారం శ్రీకాకుళం నగరానికి చెందిన మహిళ మృతదేహం అనుమానాస్పదంగా బయటపడిన విష యం విదితమే. ఈ కేసుపై అన్ని రకాలుగా ఆరా తీస్తున్నామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి సింహద్వారం వరకు వెళ్లినట్లే కనిపించిందని తర్వాత ఏ వాహనంలో వెళ్లిందీ, ఎవరితో వెళ్లిందీ అన్న ఆధారాలు దొరకలేదన్నారు.


