ప్రియాంకకు ఉద్యోగ నియామక పత్రం అందజేత
● ‘కారుణ్యానికి కష్టమే’ అన్న సాక్షి కథనానికి స్పందించిన సీఎండీ పృథ్వీతేజ్
● కేంద్ర మంత్రి సిఫారసును పక్కన పెట్టి బాధితురాలికి న్యాయం చేసిన వైనం
అరసవల్లి: భర్తను కోల్పోయిన బాధితురాలికి న్యాయం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన రఘుపాత్రుని ప్రియాంకకు విద్యుత్ విజిలెన్స్ విభాగంలోనే రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇస్తూ నియా మక పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ మేర కు గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘కారుణ్యానికి కష్టమే..!’ అన్న కథనంతో విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పృథ్వీతేజ్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కేవీ రామకృష్ణప్రసాద్ స్పందించారు. షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తూ అకాల మరణం చెందిన పోరం విజయ్ శేఖర్ భార్య రఘుపాత్రుని ప్రియాంకకు ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలంటూ స్థానిక సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తికి గురువారం ఉదయానికే ఆదేశించడంతో అందుకు తగినట్లుగా ఎస్‌ఈ ఆగమేఘాల మీద ప్రియాంకకు ఉద్యోగ నియామకపత్రాన్ని అందేలా చర్యలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఉద్యోగం బాధితురాలు ప్రియాంకకు కాకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సిఫారసు లేఖతో ఉద్యోగాన్ని తమ వారికి ఇప్పించే లా ప్రయత్నించిన విజిలెన్స్ సిబ్బంది ఆటలు సాగలేదు. ‘సాక్షి’లో కథనం రావడంతో విద్యుత్ ఉన్నతాధికారులు సీఎండీ పృథ్వీతేజ్, సీవీఓ రామకృష్ణప్రసాద్‌లు ఆదేశాల మేరకు కాంట్రాక్టు ఫైల్‌మీద సంతకాలు చేసి ఆమెకు ఉద్యోగాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు పంపిణీ చేశారు. బాధితుల పక్షాన నిలిచిన ‘సాక్షి’ పత్రికా యాజమాన్యానికి తాను రుణపడి ఉంటానని ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రియాంకకు ఉద్యోగ నియామక పత్రం అందజేత


