కష్టాలు కొనసాగుతున్నాయి
● యూరియా కోసం రైతులు, మహిళలు పడిగాపులు
● ఊరిలో రైతు సేవా కేంద్రం ఉన్నా నాలుగు కిలోమీటర్ల దూరం రాక
రణస్థలం: స్వగ్రామంలో రైతు సేవా కేంద్రం ఉన్నా నాలుగైదు కిలోమీటర్ల దూరం వ్యయ ప్రయాసలతో రైతులు వచ్చి యూరియా బస్తా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రణస్థలం–1, కొండములగాం, బంటుపల్లి రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న రైతులు రణస్థలం మండల కేంద్రంలోని రైతు సేవా సహకార బ్యాంక్ (ఎఫ్‌ఎస్‌సీఎస్)కు వచ్చి ప్రభుత్వ ధర రూ. 280లు వెచ్చించి ఐదు గంటలకు పైగా పడిగాపులు కాసి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతు లు నానా ఇబ్బందులు పడ్డారు.రబీలోనూ అదే పరి స్థితి పునరావృతమవుతోంది. గురువారం రణస్థ లం ఎఫ్‌ఎస్‌సీఎస్ బ్యాంకు వద్ద ఖరీఫ్ దృశ్యమే కనిపించింది. ఊరిలో రైతు సేవా కేంద్రాలు ఉన్న అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర రశీదు తీసుకు ని ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న సహకార బ్యాంకు వద్దకు పంపించారని రైతులు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఇబ్బంది పడలేదని చెబుతున్నారు. ఇప్పటిౖకైనా స్వగ్రామంలో యూరి యా, ఎరువులు అందజేయాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లో ఇస్తే తోపులాట అవుతుందని ఒక వ్యవసాయ అధికారి చెప్పడం గమనార్హం.


