సాగర తీరం.. కవ్వళ్ల కోలాహలం!
● మత్స్యకారులకు భారీగా చిక్కుతున్న చేపలు
● కోళ్లు, రొయ్యలు, చేపల మేతగా కలవలు
ఇచ్ఛాపురం రూరల్: శీతాకాలం వచ్చిందింటే చాలు సముద్రంలో వేటాడే మత్స్యకారులకు కలవలు పంటే. ఈ సీజన్‌లో అధిక మొత్తంలో కవ్వళ్లు(కలవలు) వలలకు చేరుతాయి. వీటితో పాటు కోనేం, నెత్తళ్లు వంటి చేపలు అధిక ధరలకు అమ్ముడుపోతాయి. ప్రస్తుతం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమంతా కలవలతో కళకళలాడుతోంది.
కలవల్లో రకాలు..
పెద్దగా ఆహారానికి ఉపయోగపడని కలవ చేపలు కోళ్లు, రొయ్యలు, చేపల ఆహారానికి ఉపయోగపడుతున్నాయి. ఈ చేపలను మత్స్యకారులు మూడు రకాలుగా విభజించి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు చేస్తున్నారు. పెద్దగా ఉండే పచ్చి కలవ చేపలను ఆహారానికి ఉపయోగిస్తుంటారు. ఇవి కేజీ రూ.60 వరకు ధర పలుకుతుండగా, గంప చేపలు రూ.600 వరకు కొనుగోలు చేస్తారు. ఈ రకం చేపలు పెద్దగా అమ్మకాలకు గిరాకీ లేకపోవడంతో రెండో రకంగా సేకరించిన కలవ చేపల్ని ఉప్పులో రెండు, మూడు రోజుల పాటు ఊరబెట్టి సముద్ర తీరంలో ఎండబెడతారు. వీటి ధర కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతోంది. ఇందులో నల్లని కలవ చేపల్ని మిక్స్ చేసి కోళ్లు, రొయ్యలు, చేపలకు మేతకు ఉపయోగిస్తారు. ఇక మూడో రకంగా ఉప్పులో నానబెట్టకుండా ఎండబెట్టిన చప్పని చేపలు. ఇవి ఏడాది పాటు నిల్వ ఉంచుకొని ఆహారంగా ఉపయోగిస్తారు. వీటి ధర మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోందని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇరత ప్రాంతాలకు ఎగుమతి..
జిల్లాలో లభించే ఉప్పు కవ్వళ్లను దళారులు లారీలు, లగేజీ వ్యాన్‌ల ద్వారా విశాఖపట్నం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న దిగా మార్కెట్, గంజాం ప్రాంతంలో ఉన్న ఉమా సంత, ముంబై, చైన్నె, కర్ణాటక, కోల్‌కత్తా వంటి ప్రాంతాలకు టన్నుల కొద్దీ తరలిస్తుంటారు.
వర్షాలొస్తే ఇబ్బందే..
ఒక్కోసారి ప్రకృతి ప్రకోపానికి మత్స్యకారులు గురికావాల్సి వస్తోంది. ఇటీవల మోంథా తుఫాన్ ధాటికి డొంకూరులో సుమారు రూ.30లక్షలు విలువ చేసే ఎండు చేపలు వర్షార్పణం అయ్యాయి. దీంతో మత్స్యకారులు భారీగా నష్టపోయారు. సంబంధిత మత్స్యశాఖాధికారులు తూతూమంత్రంగా పరిశీలించి రూ.3లక్షలు విలువైన ఎండు చేపలు వర్షంలో తడిసిపోయాయంటూ జిల్లా ఉన్నతాధికారురులకు నివేదికలు అందించి చేతులు దులుపుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సమయాల్లో చేపల్ని భద్రపరుచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామంటూ చెబుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రమ ఎక్కువ..
పెద్దగా ఆదాయం లేని మత్స్య పంట ఏదైనా ఉందంటే అది కవ్వళ్లుగా చెప్పవచ్చు. తప్పని పరిస్థితుల్లో వలకు దొరికిన చేపల్ని విడిచి పెట్టలేక ఒడ్డుకు తెచ్చి కేజీల ధరల్లో అమ్మకాలు చేస్తుంటాం. అధిక శ్రమకోర్చి ఎండబెట్టి అమ్మకాలు జరుపుతాం. వర్షాల సమయంలో తీరం ఒడ్డునే చేపలు కుళ్లిపోతుంటాయి. – చీకటి ధర్మారావు,
మత్స్యకారుడు, డొంకూరు
సాగర తీరం.. కవ్వళ్ల కోలాహలం!
సాగర తీరం.. కవ్వళ్ల కోలాహలం!


