అదరగొడుతున్న అమ్మాయిలు
● ఏపీ స్కూల్‌గేమ్స్ రాష్ట్రస్థాయి బాలికల క్రికెట్ పోటీలు ప్రారంభం
● మరోసారి సత్తాచాటిన ఉత్తరాంధ్ర జిల్లాల జట్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ బాలికల క్రికెట్ పోటీల్లో అమ్మాయిలు ఆదరగొట్టే ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో ఇండియా జట్టు విజయం సాధించిన స్ఫూర్తితో రెట్టించి ఉత్సాహంతో పోటీల్లో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ/ఇంటర్మీడియెట్ విద్య పరిధిలోని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 పరిమిత ఓవర్ల క్రికెట్ చాంపియన్‌షిప్–2025–26 పోటీల్లో ఇప్పటికే బాలుర పోరు ముగిసింది. గురువారం నుంచి బాలికల సమరం మొదలైంది. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం, శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.
సెమీస్‌లో అడుగుపెట్టిన తూ.గో.,అనంతపురం..
తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి తూర్పుగోదావరి, అనంతపూరం జిల్లా జట్లు సెమీఫైనల్‌లో ప్రవేశించాయి. తామాడిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో కృష్ణాజిల్లాపై తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప జిల్లాపై అనంతపురం జట్లు గెలుపొంది సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. మరో రెండు సెమీఫైనల్స్ బెర్త్‌కోసం నాలుగు జిల్లాలు క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నాయి. విజయనగరం–శ్రీకాకుళం మధ్య, అలాగే విశాఖపట్నం–పశ్చిమగోదావరి మధ్య జరిగే రెండు క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రెండు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. బాలికల టోర్నమెంట్‌లో పది జిల్లాలకు చెందిన జట్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి. నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాల జట్లు గైర్హాజరయ్యాయి. వీరిని నాలుగు ఫూల్స్‌గా విభజించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిన మ్యాచ్‌లు నిర్వహించారు. కర్నూలు, ప్రకాశం జిల్లా జట్లు ఓటమిపాలై లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. రాష్ట్ర పరిశీలకులు రాజేష్ గోల, మీట్ కార్యనిర్వాహక కమిటీ ప్రతినిధులు బి.వి.రమణ, ఆర్.స్వాతి, మ్యాచ్‌ల నిర్వహణ అధికారులు ఎం.వి.రమణ, ఎం.ఆనంద్ కిరణ్, ఏ.ఢిల్లేశ్వరరావు, బి.లోకేశ్వరరావు, బి.మల్లేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. ఇంటర్‌విద్య డీవీఈఓ ఆర్.సురేష్‌కుమార్, డీఈఓ ఎ.రవిబాబు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రంతో పోటీలు ముగియనున్నాయి.


