పలాసలో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం | - | Sakshi
Sakshi News home page

పలాసలో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం

Nov 7 2025 7:00 AM | Updated on Nov 7 2025 7:00 AM

పలాసలో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం

పలాసలో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం

● పట్టపగలు బలవంతంగా లాక్కెళ్లిన ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు

● విషయం బయటకు తెలియడంతో మధ్యలోనే వదిలేసిన వైనం

● ఆర్థిక వ్యవహారాలే కారణం

పలాస: జిల్లాలో కిడ్నాప్‌ సంస్కృతి విస్తరిస్తోంది. మొన్న నరసన్నపేటలో వ్యాపారి కిడ్నాప్‌ ఉదంతం మరువక మునుపే గురువారం మరో వ్యాపారిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. పలాసకు చెందిన వ్యాపారి (బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సలహాదారుడు) వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజును పట్టపగలే రెండు కార్లలో వచ్చిన ఆమదాలవలస ప్రాంతానికి ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ టీ దుకాణం వద్ద లక్ష్మీనారాయణరాజు టీ తాగుతుండగా కార్లలో వచ్చిన వ్యక్తులు కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది వ్యాపారులు కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందజేశారు. ఇక్కడ పోలీసులు ఆమదాలవలస పోలీసులకు సమాచారం అందజేయడంతో ప్రాథమికంగా విషయ సేకరణలో భాగంగా.. ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి శ్రీనుతో పాటు మరి కొంత మంది కిడ్నాప్‌కు పాల్పడినట్లు తెలిసింది. క్షణాల్లో విషయం బయటకు రావడంతో కిడ్నాపర్లు లక్ష్మీనారాయణరాజును నరసన్నపేట సమీపంలో విడిచిపెట్టి పారిపోయారు. దీంతో లక్ష్మీనారాయణరాజు నేరుగా కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. అప్పటికే అతని భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రాథమికంగా తెలిసిన వివరాలు ప్రకారం.. కిడ్నాప్‌కు గురైన లక్ష్మీనారాయణరాజు సొంత ఊరు ఆమదాలవలస. అయితే కొన్నేళ్ల కిందట పలాస వచ్చి స్థిరపడ్డాడు. ఆమదాలవలసలో మరో వ్యాపారి పొట్నూరు వేణుగోపాల్‌కు లక్ష్మీనారాయణరాజుకు ఆర్థిక పరమైన లావాదేవీల వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కిడ్నాప్‌ ఆర్థిక పరమైన లావాదేవీల వల్లనే జరిగిందని సమాచారం. ఆమదాలవలసలో వేణుగోపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విషయమై కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా వ్యాపారి కిడ్నాప్‌ విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement