జ్వరాలు
శాలిహుండం కేజీబీవీ విద్యార్థినులకు
గార: శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినులు జ్వరాలతో బాధ పడుతున్నారు. ఎక్కువ మంది జ్వరాలతో ఇబ్బందులు ప డుతున్నా ఉన్నతాధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం సాయంత్రం గార తహసీల్దార్ మునగవలస చక్రవర్తి, ఎంపీడీఓ ఈశర్ల రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో చదువు విషయమై ప్రశ్నలు వేయగా, పలువురు విద్యార్థి నులు దగ్గుతుండటంతో ప్రశ్నించడంతో జ్వరాలు, దగ్గు, జలుబుతో ఉన్నామని తెలియజేశారు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. జ్వరంతో బాధపడు తూ క్లాసురూమ్‌లోనే నేలపై పడుకున్న భీమవరం, పలాసలకు చెందిన ఇద్దరు విద్యార్థినులతో మాట్లాడారు. జ్వరం మిగిలిన విద్యార్థినులకు సోకకుండా ఉండేందుకు వీరిని ప్రత్యేక గదిలో ఉంచాలని సూ చించారు. గత కొన్ని రోజులుగా చాలా మంది బాధపడుతున్నారని, కొంత మంది విద్యార్థినులు ఇంటికి వెళ్లి బాగు చేసుకుంటున్నారని అక్కడ ఉన్న వారు తెలిపారు. ఇవన్నీ సాధారణ జ్వరాలేనని ప్రిన్సిపాల్ రజిని తెలియజేశారు. ముందుగా వండిన ఆహార పదార్థాలు పరిశీలించి సాంబారు చాలా పలుచగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వేడి నీటిని అందరికీ అందించాలని సిబ్బందికి ఆదేశించారు. వైద్య శిబిరాలు జ్వరాలు తగ్గే వరకూ నిర్వహించాలన్నారు. హాజరుపట్టిక ఆధారంగా చూడగా 287 మంది విద్యార్థినుల్లో 39 మంది సెలవు చూపుతుండటంతో జ్వరాలు అధికంగా ఉన్నాయని దీని ద్వారా తెలుస్తోంది. గురువారం ఉదయమే గార పీహెచ్‌సీ సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు రక్త నమూనాలు సేకరించారు. అయితే జ్వరంతో బాధపడుతున్నా ముగ్గురు విద్యార్థినులకు కనీసం మంచాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వారు నేలపైనే బెడ్‌షీట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.
జ్వరాలు


