
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
● మంజూరుపత్రాలు ఇచ్చినా అందని పింఛన్
● ఆందోళనలో వితంతు పింఛన్ లబ్ధిదారులు
మంచానికే పరిమితం..
ఈ చిత్రంలో మంచానికే పరిమితమైన వృద్ధురాలి పేరు శిగిలిపల్లి ఆదిలక్ష్మి. టెక్కలి మండలం తలగాం గ్రామం. 2024 మార్చిలో ఈమె భర్త మరణించారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 జూన్‌లో ఈమెకు వితంతు పింఛన్ మంజూరైంది. అప్పటికే ఆమె మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో మంచానికే పరిమితమైంది. పింఛన్ మంజూరైనా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు.
కక్షతో ఆపేశారు..
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు శిగిలిపల్లి తులసమ్మ. స్వగ్రామం టెక్కలి మండలం తలగాం. ఈమె భర్త 2024లో మరణించారు. జూన్‌లో వితంతు పింఛన్ మంజూరైంది. అయితే కుటుంబ సభ్యులు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారనే కారణంగా మంజూరైన పింఛన్ డబ్బులు ఇవ్వకుండా అవస్థలకు గురి చేస్తున్నారు. ఇదే గ్రామంలో మానసిక పరిస్థితి సక్రమంగా లేని శిగిలిపల్లి ఆదిలక్ష్మి భర్త, తులసమ్మ భర్త ఇద్దరూ అన్నదమ్ములు. ఒకరు మార్చి నెలలో మరణిస్తే.. మరొకరు జనవరిలో మరణించారు. ఈ రెండు కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నాయనే కక్షతో పింఛన్లు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెక్కలి: కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్లకు మోక్షం కలగడం లేదు. అన్ని రకాల అర్హతలు, ధ్రువపత్రాలు ఉన్నా పింఛన్లు అందక అర్హులు ఆవేదన చెందుతున్నారు. సాంకేతిక కారణాలు, ఉన్నతాధికారులపై నెపం నెట్టేస్తూ పంపిణీలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కొన్నిచోట్ల పింఛన్లు మంజూరైనా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో లబ్ధిదారులకు పెన్షన్ అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నాళ్లీ ఎదురుచూపులు?