
పీపీపీ అంటే ప్రైవేటుపరం చేయడమే..
నరసన్నపేట: మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ అంటే ప్రైవేటుపరం చేయడమేనని, కూటమి ప్రభుత్వం తీరును ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పిలపునిచ్చారు. నరసన్నపేట మండలం మడపాంలో బుధవారం నిర్వహించిన రచ్చబండలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చి స్వప్రయోజనాలకు వాడుకోవాలని, కొందరికి కట్టబెట్టాలని చూస్తోంన్నారు. ఆ పార్టీలో కొన్నాళ్లు కొనసాగిన తనకు వారి పన్నాగం అంతా తెలుసునని వివరించారు. కల్తీ మద్యం వ్యవహారంపై తప్పు కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ కింజరాపు సోదరులు వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. పోలాకి జెడ్‌పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ కూటమి పాలనలో జరుగుతున్న అన్యాయాలు, కార్యకర్తలు పడుతున్న బాధలు వివరించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మండలస్థాయిలో వివిధ అనుబంధ సంఘాలకు అధ్యక్షులుగా ఎంపికై న నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో మడపాం ఎంపీటీసీ రువ్వ వాసు, మడపాం, దేవాది సర్పంచ్‌లు రాపర్తి ఎరుకోడు, మంతిన రాము, ఎంపీపీ ఆరంగి మురళి, జెడ్‌పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు తదితరులు పాల్గొన్నారు.