
అత్తమామలపై జనసేన నేత దాడి
ఇచ్ఛాపురం: పిల్లనిచ్చిన అత్తమామలపై దాడికి పాల్పడిన జనసేన నేతపై కేసు నమోదైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ దాసరి రాజుకు పట్టణంలోని అప్పన్నపేటకు చెందిన మోహినితో 2018లో వివాహమైంది. రూ.5 లక్షల కట్నమిచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. 2023లో మోహినిని రాజు అదనపు కట్నంతో పాటు ఆమె తల్లిదండ్రుల ఆస్తిలో వాటా తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టా డు. వాటిని తీసుకొచ్చేవరకు ఇంటికి రావద్దని ఇద్దరు ఆడపిల్లలతోపాటు భార్యను పుట్టింటికి పంపించేశాడు. ఈ క్రమంలో తనకు భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ ఈ ఏడా ది సోంపేట కోర్టులో రాజు కేసు వేశాడు. ఇది విచారణలో ఉండగా రాజు, అతని అన్నయ్య కుమారుడు దీపక్, అతని చెల్లి రోజా, తల్లి ఆదిలక్ష్మితో కలిసి శనివారం తన ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులు కాళ్ల అప్పారావు, రవణమ్మతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడి, తనను కొట్టాడని పోలీసులకు మోహిని ఫిర్యాదు చేశారు. దీంతో ఇచ్ఛాపురం పోలీస్‌స్టేషన్‌లో దాసరి రాజు తదితరులపై కేసు నమోదైంది.
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు, అర్చ నలు జరిగాయి. ప్రత్యేకంగా ఆదివారం ఉద యం 6 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలకు అనుమతి ఇవ్వడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆదిత్యుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆరోగ్యం కోసం మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు.
13 నుంచి ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‘ ఉత్సవాలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జీఎస్టీ 2.0 విజయోత్సవాలను పురస్కరించుకుని ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ పేరుతో నెల రోజు ల ఉత్సవాలను జిల్లాలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. ఇందులో భాగంగా అక్టోబర్ 13 నుంచి 19 వరకు ఎన్‌టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్, ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నట్లు తెలిపారు. ప్రజలకు జీఎస్టీ వల్ల కలిగిన సేవింగ్స్‌ను చూపించడానికి ప్రతి స్టాల్‌లో ప్రీ జీఎస్టీ ధర, పోస్ట్ జీఎస్టీ ధర, సేవింగ్స్ శాతం వివరాలు చూపించనున్నారు. ఆటోమొబైల్స్ స్టాళ్ల ఏర్పాటుకు రవాణా శాఖ, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వస్తువులు, మొబైల్ ఫోన్ల స్టాళ్లకు కమర్షియల్ టాక్స్ విభాగం, మున్సిపల్ కమి షనర్, ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ కింద ఏపీసీఓ, లేపాక్షి సంస్థలు, పొందూరు చేనేత, ఇత్తడి, హస్త కళల వస్తువులు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యటన నేడు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పౌర సరఫరాల శాఖపై ప్రాంతీయ సమావేశం సోమ వారం ఉంటుందని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ ఆదివారం వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏఎస్‌ఆర్, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొంటారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాయంత్రం 3 గంటలకు మిల్లర్స్ అసోసియేషన్, ధాన్యం సేకరణ సంస్థలు, రైతు సంఘాలతో సమావేశాల్లో మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి తీవ్రగాయాలు
పొందూరు: లోలుగు గ్రామానికి సమీపంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న లోలుగు గ్రామానికి చెందిన లోలుగు హరికృష్ణ, చోల్ల ప్రసాద్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన ఎం.జగన్‌మోహనరావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.