
ఓడీల కోసం పాట్లు
● ఇంకా అందని డిగ్రీ ఓడీలు
● పైచదువులకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
ఎచ్చెర్ల: డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. వీరు ఉత్తీర్ణత సాధించి నెల దాటినప్పటికీ వీరికి ఇప్పటికీ సర్టిఫికెట్లు అందించలేదు. జిల్లాలో మొత్తం మొత్తం 15 ప్రభుత్వ కళాశాలలు, 84 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలకు సంబంధించి విద్యార్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి పై చదువుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి అవసరమైన ప్రొవిజనల్స్, ఓడీ సర్టిఫికెట్లు ఎచ్చెర్ల లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అందిస్తోంది. గతంలో ఏ కళాశాలకు సంబంధించి ఆ కళాశాలకు సర్టిఫికెట్లను పంపించేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలోని డిగ్రీ విద్యార్థులంతా వర్సిటీకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంది. వీరికి ఎలాంటి ఫీజు బకాయిలు లేవని సంబంధిత కళాశాల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకువస్తే వర్సిటీ వారు విద్యార్థికి ప్రొవిజినల్స్, ఓడీ అందిస్తారు. అయితే ఈ ప్రక్రియ జాప్యం కావడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ అనంతరం చదవాల్సిన ఏపీ పీజీ–సెట్, లా–సెట్, ఐ–సెట్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సిలింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులు తమ వద్ద సర్టిఫికెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ వర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.