
మేఘ సందేశం.. మృత్యు సంకేతం
● జనాలను బలికొంటున్న పిడుగులు
● జాగ్రత్తలు పాటిస్తే మేలంటున్న
నిపుణులు
సరుబుజ్జిలి: వర్షాలు తగ్గి చలి పెరిగే కాలం వచ్చేసినా.. జిల్లాకు తుఫాన్లు, పిడుగుల భయం వీడడం లేదు. వర్షాల సమయంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా పిడుగులు పడుతున్నాయి. పొలం పనులకు వెళ్తున్న వారు, పశువులను మేతకు తీసుకెళ్తున్న వారు దీని వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. విలువైన పశు సంపదను కూడా నష్టపోతున్నారు. సరుబుజ్జిలి పాలవలస గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దాసరి అప్పన్న చిగురువలస సమీపంలో పిడుగుపాటుకు మృతిచెందాడు. గతంలో బూర్జ మండలం లక్కుపురం పంచాయితీ పణుకుపర్త గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుకున్న బాలిక కొండ్రోతు మేఘన పిడుగుకు బలైపోయింది. అదే గ్రామానికి చెందిన మహిళలు మక్క కళ్యాణి, అడపా సుగుణ అస్వస్థతతకు గురయ్యారు. కాసిన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ వైపరీత్యం నుంచి బయటపడగలమని నిపుణులు సూచిస్తున్నారు.
సూచనలివే..
వర్షం కురిసేటపుడు చెట్ల కింద చేరకూడదు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చినప్పుడు పొలం పనులు చేయకపోవడం ఉత్తమం.
మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంతకన్న తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలోపు పిడుగుపడే అవకాశం ఉంటుంది.
మెరుపు కనపడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయరాదు.
గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్‌ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్ ఉంటే స్విచ్ఛాఫ్ చేయాలి.
వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లరాదు.
ప్రథమ చికిత్స చేయాలి
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను ఒక అడుగుపైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి.
– యండ భవ్యశ్రీ, వైద్యాధికారి, సరుబుజ్జిలి

మేఘ సందేశం.. మృత్యు సంకేతం