
పాత జీతమే గతి
●పదోన్నతి..
● పండిట్లకు జీతాలు లేని పదోన్నతులు
● మార్చిలో పదోన్నతులు పొందిన వారికి నేటికీ ఎస్జీటీ స్థాయి జీతాలే
● పోస్టులు అప్‌డేట్ చేయకుండా ఖజానా శాఖ అనుమతి లేకుండా పదోన్నతులు
● పండిట్లను మభ్యపెడుతున్న ప్రభుత్వం
శ్రీకాకుళం: హిందీ పండిట్లకు పదోన్నతులు దక్కినా ఆ స్థాయి జీతం మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది మార్చి నెలలో 76 మంది హిందీ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినా నేటికీ ఎస్జీటీ స్థాయి జీతాలే చెల్లిస్తున్నారు. ఐదు రోజుల కిందట మరో 87 మంది పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినా వీరికి కూడా పెరిగిన జీతాలు అందే పరిస్థితి లేదు. వీరంతా డీఈఓ పూల్‌లో ఉంటూ ఎస్‌జీటీ పోస్టులో కొనసాగుతున్నారు. ఎక్కడ పని చేస్తున్న వారికి అక్కడే పదోన్నతులు కల్పించేలా ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మేరకే జిల్లా స్థాయిలో ఉత్తర్వులు వెలువరించారు. ఖజానా శాఖ వద్ద ప్రస్తుతం వారు పనిచేస్తున్న ఎస్జీటీ స్థాయి సమాచారమే ఉండడంతో ఆ మేరకే జీతాలు చెల్లిస్తున్నారు.
చిత్తశుద్ధి ఉంటే..
వాస్తవానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోస్టులను అప్‌డేట్ చేయాలి. కానీ అలా చేయకుండా పండిట్లను మభ్యపెడుతూ పదోన్నతులు కల్పించినట్లు ప్రచారం చేస్తున్నారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పండిట్ పోస్టులను రద్దు చేసి, వారందరినీ స్కూల్ అసిస్టెంట్లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఆనాడే వీరందరి కేడర్ స్కూల్ అసిస్టెంట్ స్థాయిగా మారిపోయింది. అయితే జిల్లాలో అప్పటికి ఉన్న ఖాళీల మేరకు భర్తీలు జరిపి, మిగిలిన వారిని డీఈఓ పూల్‌లో ఉంచారు. పదవీ విరమణ ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో వీరిని భర్తీ చేయడం ద్వారా సమస్య పరిష్కరించే అవకాశం ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం అలా కాకుండా మార్చి నెలలో కోర్టు ఆదేశాల మేరకు ఓ 76 మందికి పదోన్నతులు కల్పించగా, వారంతా ఎస్‌జీటీ పోస్టుల్లోనే ఉండడం వల్ల స్కూల్ అసిస్టెంట్ జీతాలు అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించకుండానే, తాజాగా మరో 87 మందికి పదోన్నతి చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. ఇది కేవలం పండిట్ల కంటి తుడుపు చర్య మాత్రమే తప్ప ఏ మాత్రం లబ్ధి చేకూరదు.
ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రేషనలైజేషన్ చేసి పలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. అలా కాకుండా ఆయా పోస్టుల్లోనే పండిట్లకు పదోన్నతులు కల్పించి ఉంటే జీతాల సమస్య తలెత్తేది కాదు. మార్చిలో పదోన్నతులు పొందిన పలువురు పండిట్లు, స్కూల్ అసిస్టెంట్ జీతాల కోసం బిల్లులను ఖజానా శాఖకు దఖలు చేయగా దాన్ని తిరస్కరించినట్లు పలువురు పండిట్లే బహిరంగంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే మార్చి నెలలో పదోన్నతులు పొందిన పండిట్లకు ఇచ్చిన ఉత్తర్వుల్లో 2019 నుంచి వీరికి పదోన్నతులు కల్పిస్తున్నట్లు పేర్కొంటూ, ఆ కాలాన్ని నేషనల్ సీనియారిటీగా పేర్కొని ఆ కాలానికి ఇంక్రిమెంట్లు కూడా మంజూరు చేసినట్లు పొందుపరిచారు. దీని ఆధారంగా కొందరు పండిట్లు స్కూల్ అసిస్టెంట్ జీతంతో పాటు ఎరియర్స్ మంజూరునకు సంబంధించిన బిల్లులను కూడా ఖజానా శాఖకు దాఖలు చేయగా వాటన్నింటినీ అన్ని మండలాల్లోనూ తిరస్కరించినట్లు సమాచారం.
నా దృష్టికి రాలేదు
మార్చిలో 76 మందికి తాజాగా 87 మందికి పండిట్ల నుంచి స్కూల్ అసిస్టెంట్‌కు పదోన్నతులు కల్పించాం. గతంలో పదోన్నతి పొందిన వారికి స్కూల్ అసిస్టెంట్ జీతాలు అందడం లేదనే విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పరిశీలన చేసి రాష్ట్రస్థాయికి నివేదిస్తాం. ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలోనే పరిష్కారమవ్వాల్సి ఉంటుంది.
– రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి