
● స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
ప్రజా జీవితంలో పరిశుభ్రతను భాగం చేసుకోవాలని, చెత్తను సంపదగా మార్చాలని కలెక్ట ర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డులు–2025 ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 95 శాతం ఇంటింటికీ చెత్త సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అలాగే బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా 623 గ్రామాలను ప్రకటించామని, జిల్లాలో మొత్తం తొమ్మిది మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా రాష్ట్ర స్థాయిలో రెండు, జిల్లా స్థాయిలో 46 స్వచ్ఛ అవార్డులు లభించాయని కలెక్టర్ ప్రకటించారు. ప్రతి సచివాలయంలోనూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, పౌరుల నుంచి సేకరించిన కిలో చెత్తకు రూ.10 చెల్లిస్తామని తెలియజేసారు. అనంతరం రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన నేలబొంతు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల పాఠశాల, శ్రీ గౌరిశంకర మహిళా సమాఖ్యను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జిల్లా స్థాయిలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చిన వారిని గుర్తించి మొత్తం 46 మందికి అవార్డులను ప్రదానం చేశారు. – అరసవల్లి