వృథాగా వంశధార! | - | Sakshi
Sakshi News home page

వృథాగా వంశధార!

Oct 7 2025 3:23 AM | Updated on Oct 7 2025 3:23 AM

వృథాగా వంశధార!

వృథాగా వంశధార!

హిరమండలం:

ప్పట్లో ప్రధాని పదవికి అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదులుకున్నా.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ ప్రగల్భాలు పలుకుతుంటారు. నాడు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న పరపతిని ఉపయోగించుకొని రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టూ తీసుకురాలేదు. కనీసం ఒడిశాతో జల వివాదాలను సైతం పరిష్కరించలేదు. నాటి ఒడిశా పాలకపక్షం బీజేడీ భాగస్వామ్య పార్టీ అయినా చొరవచూపలేదు. ఇప్పుడు కూడా అక్కడ తమ మిత్రులైన బీజేపీ ప్రభుత్వం ఉన్నా సీఎం చంద్రబాబు చొరవ చూపించడం లేదు. జిల్లా కూటమి నేతలు దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. ఫలితంగా ఇప్పటికీ వంశధారకు సంబంధించి జల వివాదం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి శాపంగా మారుతోంది.

ప్రత్యేక దృష్టి..

2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. ఒడిశాతో జల వివాదాలు పరిష్కరించుకోవడానికి సిద్ధమయ్యారు. వంశధార నదీ జలాల వినియోగ వివాదాన్ని ఇరు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కరించుకోవాలని వంశధార ట్రైబ్యునల్‌ ఆదేశించిన నేపథ్యంలో 2022లో అప్పటి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నారు. నేరుగా నవీన్‌తో చర్చలు జరిపారు. నేరడి విషయంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో రెండు చోట్లా ప్రభుత్వాలు మారిపోయాయి. ఇరు రాష్ట్రాల్లో రెండు అనుకూల ప్రభుత్వాలు వచ్చినా నేరడి విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు.

ప్రతిపాదనలతో సిద్ధం..

నేరడి జలాశయం నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.650 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించింది. కానీ ఒడిశా అభ్యంతరాలు, నిర్మాణ ప్రాంతం రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాంతం కావడంతో అడుగు ముందుకు పడడం లేదు.న ఇక్కడ బ్యారేజీ నిర్మించాలంటే ఒడిశా భూభాగం పరిధిలోని 106 ఎకరాలను ఏపీకి అప్పగించాలి. ఈ విషయంలో వంశధార ట్రైబ్యునల్‌ ఆదేశాలను సైతం ఒడిశా తుంగలో తొక్కింది. కేంద్ర జల సంఘం అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేయాలన్న సూచనలను బేఖాతరు చేసింది. సహాయ నిరాకరణతో బ్యారేజీ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ వచ్చింది. అందుకే అప్పటి సీఎంగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాయడమే కాకుండా.. నేరుగా అప్పటి సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలిసి సమస్యలపై చర్చించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు అటువంటి ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

నాడే ఒప్పందం జరిగినా..

వాస్తవానికి నేరడి బ్యారేజీ నిర్మాణానికి 1961లో ఒప్పందం కుదిరింది. సాధారణంగా వంశధారలో 115 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ఏపీ, ఒడిశాలు సమానంగా నీటిని పంచుకోవాలన్నది ఒప్పందం. కానీ వంశధారపై నీటి ప్రాజెక్టులు నిర్మిస్తే నీటి వినియోగం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం తెరపైకి వచ్చింది. కానీ ఒడిశా అడుగడుగునా అడ్డంకులు సష్టించడంతో ఏపీ ప్రత్యామ్నాయ ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. అందులో భాగంగానే హిరమండలం వద్ద గొట్టా బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు జిల్లాలో సగం మండలాలను సస్యశ్యామలం చేస్తోంది. కానీ వంశధారలో వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంశధార మిగులు జలాలపై దృష్టిసారించారు. అదే సమయంలో ఒడిశాతో జల వివాదం నడుస్తుండడంతో ప్రత్యామ్నాయంగా వంశధార ఫేజ్‌–1 నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేవలం వరద నీటి మళ్లింపుతో చేపట్టిన ఈ పథకం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. కానీ నేరడి ప్రాజెక్టుకు మాత్రం ముందుకు అడుగుపడలేదు. ఈ పరిస్థితిని గమనించిన జగన్‌మోహన్‌రెడ్డి ఒకవైపు ఒడిశాతో జల వివాదం పరిష్కరించుకుంటూనే.. గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి నీటిని వంశధార రిజర్వాయర్‌లోకి మళ్లించే చర్యలు చేపట్టారు. వంశధార ఫేజ్‌–2 పథకం నిర్మాణం పూర్తయితే 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీరందే అవకాశముంది.

నేరడి ఊసెత్తని చంద్రబాబు సర్కారు

ఒడిశాలో అనుకూల ప్రభుత్వం ఉన్నా పట్టించుకోని వైనం

సరిహద్దు జలాల సమస్యకు కలగని మోక్షం

అప్పట్లో ఎంతో చొరవచూపిన

జగన్‌మోహన్‌రెడ్డి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఏపీలో కూటమి, ఒడిశాలో బీజేపీ ఒకేసారి అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలోని ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి. ఏపీలోనూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అయినప్పటికీ పొరుగున ఉన్న ఒడిశాతో జల వివాదానికి మాత్రం పరిష్కారం చూపలేకపోతోంది.

8 ఏళ్ల కిందట గ్రీన్‌సిగ్నల్‌

వాస్తవానికి నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార ట్రైబ్యునల్‌ ఎనిమిది ఏళ్ల కిందట అంగీకరించింది. 2017 సెప్టెంబరు 13న తీర్పును వెలువరించింది. నాటి ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకపోవడం, ఒడిశాకు దీటుగా పోరాడకపోవడంతో ఎలాంటి అడుగుపడలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదలిక వచ్చింది. ఒకవైపు ఒడిశాను అభ్యర్థిస్తునే మరోవైపు న్యాయపోరాటానికి సన్నద్ధమైంది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన ఒడిశా పరిధిలోని 106 ఎకరాల భూమిని అప్పగించాలని కోరారు. ఏకంగా భువనేశ్వర్‌ వెళ్లి సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలిశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా కనీస ప్రయత్నాలు చేయడం లేదు. అలాగని గొట్టా బ్యారేజీలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement