
ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
లేడీ రౌడీ షీటర్‌పై ఎస్పీకి ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: సరుబుజ్జిలి మండలంలోని మూలసవలాపురానికి చెందిన లేడీ రౌడీషీటర్, ఆమె అనుచరులపై అదే గ్రామానికి చెందిన కొంతమంది ఎస్పీ మహేశ్వరరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. దందాలు, రౌడీయిజం, సారా, మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, భూ, ఇళ్ల స్థలాల కబ్జాలు జిల్లా నలుమూలలు చేస్తూ గ్రామ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని బ్యాంకర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న జామి రమేష్ తరపున మధ్యవర్తి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నది ఈమె అనుచరులేనన్నారు. అర్ధరాత్రి ఇంటి యజమాని తంగుడు ఉపేంద్ర ఇంట్లో చొరబడి దౌర్జన్యానికి పాల్పడేందుకు యత్నించగా.. స్థానికులు దేహశుద్ధి చేయడంతో వెనుదిరిగారని తెలిపారు. అనేక పోలీస్‌స్టేషన్లలో వీరిపై కేసులున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో కె.ధనుంజయ, జి.మోహనరావు, ఎస్.వసంత్‌కుమార్, జి.శ్రీధర్ మరో 30 మందికి పైగా ఉన్నారు. కాగా వీరు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే అవతలి వర్గం వాళ్లూ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడికి కొద్ది క్షణాల్లోనే టౌన్ డీఎస్పీ వివేకానంద, ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, జె.ఆర్.పురం సీఐ అవతారం ఎస్పీని కలిసేందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు