
అద్దె ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బ్యాంకర్స్ కాలనీ శివబాలాజీ ఆలయం పరిసర ప్రాంతంలో ఓ ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఐదుగురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించారు. రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తంగుడు ఉపేంద్రకు చెందిన ఇంట్లో జామి విష్ణుమూర్తి కుటుంబంతో సహా అద్దెకు ఉండేవాడు. అద్దె విషయమై ఇద్దరి మధ్య కొన్నాళ్లు వివాదం నడిచింది. ప్రస్తుతం విష్ణుమూర్తి కుమారుడు జామి రమేష్ వద్దే అద్దె ఇంటి తాళాలు ఉన్నాయి. ఈ క్రమంలో రమేష్ తమ ఇంట్లో పని ఉందని, కొంతమంది మనుషులు కావాలంటూ సరుబుజ్జిలికి చెందిన చంటి అనే వ్యక్తిని సంప్రదించాడు. ఆయన కొంత నగదు తీసుకొని ఆమదాలవలసకు చెందిన బుజ్జి, దివ్య, యశోద నవీన్, ధనలక్ష్మీలను పురమాయించి శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రమేష్ చెప్పిన ఇంటికి పంపించాడు. వీరు రావడాన్ని సీసీ కెమెరాలో గమనించిన యజమాని ఉపేంద్ర.. ఎవరు మీరు.. ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అయినా వారు వినకుండా గదిలోకి వెళ్లి తలుపు వేసేశారు. దీంతో శ్రీకాకుళం డీఎస్పీకి సమాచారం అందించారు. అదే రోజు రాత్రి రూరల్ ఎస్‌ఐ సిబ్బందితో వెళ్లి తలుపులు కొట్టినా తీయలేదు.
మరుసటి రోజు శనివారం పోలీసులు, కాలనీవాసులు వెళ్లగా ఎట్టకేలకు తలుపులు తీశారు. అప్పటికే ఆగ్రహంగా స్థానికులు ఇంట్లో బసచేసిన ఐదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేశారు. వీరు ఎందుకు వచ్చారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.