టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రి సమీపంలో శనివారం సాయంత్రం పంది అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన యవ్వారు దుర్యోధనరావు తన భార్య గంగాభవానీ, ఇద్దరు పిల్లలు, అత్తయ్య పినకాన రాములమ్మతో కలిసి ఆటోలో శనివారం టెక్కలి మండలం వీఆర్‌కేపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వలేసాగరం వద్ద నందిగాం మండలం సవర రామకృష్ణపురం గ్రామానికి చెందిన నందిగాం శోభావతిని అదే ఆటోలో ఎక్కించుకుని టెక్కలి వైపు వస్తుండగా జిల్లా ఆస్పత్రి సమీపంలో పంది అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో ఒక్కసారిగా ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఆరుగురికి గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. శోభావతి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిఫర్ చేశారు. మిగిలిన వారికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.
టోకెన్లు సరే..ఎరువులేవీ?
ఆమదాలవలస రూరల్: ఎరువుల కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. ఆమదాలవలస మండల కేంద్రం నుంచి ఒక్కోరైతుకు రెండు, మూడు బస్తాల యూరియా అందించేందుకు ఇటీవల వ్యవసాయ, రెవెన్యూ, రైతు సేవా కేంద్రాల అధికారులు సంతకం చేసి టోకెన్లు అందించారు. వీటిని పట్టుకొని ఎరువుల సరఫరా కేంద్రం వద్ద క్యూ కట్టినా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆమదాలవలస మండలం ఇసుకలపేట గ్రామానికి చెందిన అన్నెపు నీలారావుకు టోకెన్ అందించినా ఇంతవరకు ఎరువు అందలేదు. ఇలాంటి రైతులు ఎంతోమంది ఉన్నారు.