
కూటమి వైఫల్యాలు ప్రజలకు చెబుదాం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
కూటమి వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి మనమంతా కలసికట్టుగా అడుగులు ముందుకేయాలని పార్టీ జిల్లా అధ్యక్షు డు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ సమన్వయకర్తలు, పార్లమెంటరీ పరిశీలకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో దాదాపుగా అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం పూర్తయ్యిందని, మిగిలిన టీమ్‌లను నియమించేందుకు యాక్టివ్‌గా పనిచేసే వారికి అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 5 పూర్తి చేసి తరగతులు ప్రారంభించి సేవలందిస్తే.. వాటిని సైతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సొమ్ము పోగు చేసుకోవాలని చూస్తున్నారన్నారు. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేందుకు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ గ్రామం నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు అన్ని రకాల అనుబంధ విభాగాలు పూర్తిచేయాలని, ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. 5 పంచాయతీలకు ఒక్క అబ్జర్వర్ ఉండాలన్నారు. ఈ నెల 20వ తేదిలోపు గ్రామస్థాయి కమిటీలు పూర్తయిపోయేలా చూడాలన్నారు. అన్ని విభాగాల్లో 10 శాతం మహిళలు ఉండేందుకు ప్రయత్నం చేయాలన్నారు.
మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఏ ఒక్కరినీ విస్మరించే పరిస్థితి ఉండదని, సైనికుల్లా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, పిరియా సాయిరాజ్, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్లమెంటరీ రాష్ట్ర కార్యద ర్శులు దుంపల రామారావు, కరిమి రాజేశ్వరరావు, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, వలంటీర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు గంట్యాడ రమేష్, జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.