
అర్ధరాత్రి ఆక్రందన
● దేవాది వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ ● నుజ్జయిపోయిన క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్ ● గంట పాటు శ్రమించి బయటకు తీసిన స్థానికులు
నరసన్నపేట: జాతీయ రహదారిపై దేవాది వద్ద లారీ డ్రైవర్ బబుల్ సింగ్ శుక్రవారం అర్ధరాత్రి చేసిన ఆక్రందనలు స్థానికులకు కలిచి వేశాయి. జాతీయ రహదారిపై నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మార్గంలో దేవాది ముందు ఒక టీ స్టాల్ వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో వెనుక ఉన్న లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జుయిపోయింది. డ్రైవర్ బబుల్ సింగ్ ఆ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. అర్ధరాత్రి పూట ఆయన పడిన బాధ వర్ణణాతీతం. అటుగా వెళ్తున్న వారు వాహనాలు ఆపి ఎంతగా ప్రయత్నించినా ఆయనను బయటకు తీయలేకపోయారు. చివరికి హైడ్రా వాహనం సహాయంతో స్థానికులు కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. అప్పటికే డ్రైవర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్‌లో సిబ్బంది ప్రథమ చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆ గంట కాలం డ్రైవర్ పడిన నరక యాతన చూడలేకపోయామని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. కాగా దేవాది –కోమర్తిల మధ్య జాతీయ రహదారిపై ప్రమాదా లు అధికంగా జరుగుతున్నాయి.