
కార్మికులపై కక్ష సాధింపు తగదు
రణస్థలం: యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో 22 ఎళ్లుగా పని చేస్తున్న కార్మికులను వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే నెపంతో తొలగించడం అన్యాయమని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారు 50మంది కార్మికులను తొలగించడం దారుణమన్నారు. ఈ విషయమై యూబీ పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే కొద్ది రోజుల్లోనే తిరిగి వేస్తామని చెప్పి నేటికి ఏడాదిన్నర అయినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ సానుభూతిపరులైన కార్మికులు మద్యం తాగినా, పరిశ్రమలో గొడవలు సృష్టించినా ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. భూగర్భ జలవరుల శాఖ అధికారుల అనుమతులు లేకుండా 500 అడుగుల లోతున 3 అడుగుల వెడల్పున బోర్లు వేసి జలాలు ఎలా తోడేస్తున్నారని, పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని చెప్పారు. కలుషిత వ్యర్థ జలాలు రణస్థలం పంచాయతీలోని సీతంపేట చెరువులోనికి, బంటుపల్లి జగనన్న కాలనీ వైపు వదిలేస్తుండటంతో పంటలకు నష్టం కలుగుతోందన్నారు. పరిశ్రమ నుంచి వెలువడే బూడిద వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు, రాష్ట్ర అనుబంధ విభాగం జాయింట్ సెక్రటరీ కెల్ల రామకృష్ణ, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దన్నాన హరి, బంటుపల్లి మాజీ సర్పంచ్ పాశపు ముకుందరావు, కార్మికులు పాల్గొన్నారు.