
6న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఈ నెల 6న స్వర్ణాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేసేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్ణయించిందని, పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రజలు.. ఇలా ఎవరు బాగా పనిచేసినా అవార్డు అందుతుందన్నారు. అన్ని శాఖలను పరిగణనలోకి తీసుకొని 51 అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్రీన్ స్పాట్ ట్రాన్స్ఫార్మేషన్ 83 పాయింట్ల లక్ష్యాన్ని రెండు వారాల్లో చేరుకున్నట్లు తెలిపారు. డై అండ్ నైట్ వంతెన కింది భాగంలో ఇకపై మెడికల్ వ్యర్థాలు పారబోస్తే చర్యలు తప్పవని మెడికల్ ల్యాబ్స్, మెడికల్ షాపులు, ఆస్పత్రులను హెచ్చరించినట్లు చెప్పారు. సఫాయి మిత్ర సురక్ష శిబిర్‌లో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించి మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రకటిస్తామన్నారు. జీఎస్టీ తగ్గింపుపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19న షాపింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పాత ధరలు, తగ్గింపు ధరలపై అవగాహన కల్పిస్తామన్నారు. పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో జిఎస్టీ తగ్గింపు వలన ఉపయోగం గూర్చి తెలియజేస్తారన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు పాల్గొన్నారు.