
రెండోసారి.. నోటిఫికేషన్ జారీ
డిగ్రీ ప్రవేశాలపై ఎట్టకేలకు మొద్దునిద్ర వీడిన కూటమి సర్కారు
ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు రిజిస్ట్రేషన్లు
అక్టోబర్ 6న సీట్ల కేటాయింపు
మరోవైపు కొనసాగుతున్న కాలేజీల సమ్మె
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 100 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 16 ప్రభుత్వ, 84 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 28 వేల సీట్లు ఉన్నాయి. ఇందులో 8వేల సీట్లు కూడా భర్తీకావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కొన్నేళ్ల కిందట జిల్లా నుంచి 20 వేల వరకు సీట్లు నిండేవి. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. డిగ్రీ ప్రవేశాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఐటీఐవైపు విద్యార్థులు చూస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకపోవడంతో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని విద్యాసంస్థల మేనేజ్‌మెంట్ల ప్రతినిధులు చెబుతున్నారు.
డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాల కోసం వివిధ కారణాలతో అడ్మిషన్లు పొందలేని విద్యా ర్థుల కోసం రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.
– డాక్టర్ కణితి శ్రీరాములు, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఐడీ కళాశాల) ప్రిన్సిపాల్
శ్రీకాకుళం న్యూకాలనీ:
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మొద్దునిద్ర వీడింది. డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల కోసం సకాలంలో దర ఖాస్తులు చేసుకోలేని విద్యార్థుల కోసం రెండో విడ త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మొద టి ఫేజ్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో క్లాసులు మొదలుకాలేదు. ఇంటర్మీడియె ట్ ఫలితాలు వెలువడి నాలుగైదు నెలలు గడిచినా నోటిఫికేషన్ విడుదల చేయకుండా విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసిన విషయం తెలిసిందే.
ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..
●2025–26 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ అడ్మిషన్ల కోసం రెండో విడత ప్రవేశాలకు కాలేజియేట్ ఎడ్యుకేషన్ వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీలు రూ.200 నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
●ఈ నెల 26 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు
●27 నుండి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
●ఈనెల 29 నుంచి అక్టోబర్ ఒకటి వరకు వెబ్ ఆప్షన్లు ●అక్టోబర్ 6న కాలేజీల్లో సీట్ల కేటాయింపు
●7 నుంచి క్లాసులు ప్రారంభం
కాలేజీలు మూసివేతతో ఆందోళన..
కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రైవేటు డిగ్రీ కాలేజీలు సమ్మెబాటపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి ప్రైవేటు కాలేజీల్లో క్లాసులు రద్దు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీలను మూసివేశారు. జిల్లాలో ఒక్క డిగ్రీ విద్యకు సంబంధించే జిల్లాలో 80 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు ఏపీ ప్రైవేటు కాలేజీల మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం తమకు సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తుండటంతో దిగులు చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిగ్రీ విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు.

రెండోసారి.. నోటిఫికేషన్ జారీ