
మనస్థాపంతో ఆత్మహత్య
బూర్జ: మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన బొమ్మాళి శిరీష (22) గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శిరీషకు తల్లిదండ్రులు వివాహ సంబంధాలు చూస్తుండగా ఆమె తిరస్కరిస్తూ ఉండేది. వివాహం చేసుకోనని.. తన చిన్నాన్న దగ్గర చదువుకుంటానని చెప్పేది. ఈ క్రమంలో బుధవారం భోజనాల తర్వాత పక్క ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా, ఆమె తల్లి తనకు సాయం చేయకుండా పక్క ఇంటికి ఎందుకు వెళ్లావని మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్నటువంటి గడ్డిమందు తాగేసింది. తల్లి గన్నెమ్మ చూసి వెంటనే 108 సాయంతో శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి తండ్రి రాజు, తల్లి గన్నెమ్మ, అక్క దివ్య, డిగ్రీ చదువుతున్న తమ్ముడు మని ఉన్నారు. తల్లి గన్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.ప్రవళ్లిక తెలియజేశారు.