స్పష్టత ఏదీ..? | - | Sakshi
Sakshi News home page

స్పష్టత ఏదీ..?

Sep 27 2025 6:51 AM | Updated on Sep 27 2025 6:51 AM

స్పష్టత ఏదీ..?

స్పష్టత ఏదీ..?

స్పష్టత ఏదీ..?

విధులపై డీఎంఈకి రిమ్స్‌ వైద్యుల నివేదన అడ్మినిస్ట్రేటర్‌, వైద్యుల మధ్య కోల్డ్‌ వార్‌ అపారిశుద్ధ్యంపై కలెక్టర్‌ మండిపడడంతో మనస్థాపం

ఇంజినీరింగ్‌ అధికారులదీ ఇదే పరిస్థితి

శ్రీకాకుళం:

రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర అధికారుల విధులు ఏమిటనే దానిపై స్పష్టత ఇవ్వాలని రిమ్స్‌లో పనిచేస్తున్న పలువురు వైద్యులు డీఎంఈకి నివేదించారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ఆరు నెలల క్రితం వరకు ఎటువంటి సమస్య ఉండేది కాదు. కళాశాల, ఆస్పత్రుల్లో సమస్యలన్నింటినీ కళాశాల ప్రిన్సిపాల్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంవోలు పర్యవేక్షించేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం అడ్మినిస్ట్రేటర్‌ అంటూ ఒక పోస్టును క్రి యేట్‌ చేసి డీడీ స్థాయి అధికారిని నియమించింది. దీంతో అప్పటినుంచి సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే కేజీహెచ్‌ నుంచి రాష్ట్రస్థాయికి

ఇటువంటి వ్యవహారం ఇప్పటికే విశాఖపట్నంలోని కేజీహెచ్‌ నుంచి రాష్ట్రస్థాయికి చేరగా, తాజాగా శ్రీకాకుళం వ్యవహారం కూడా చేరింది. శ్రీకాకుళంలో అడ్మినిస్ట్రేటర్‌, వైద్యుల మధ్య ఎప్పటినుంచో కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. దీనిపై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో లోలోనే మదన పడుతూ వచ్చారు. తాజాగా ఐదు రోజుల క్రితం కలెక్టర్‌ రిమ్స్‌లో జరిగిన మొక్కల నాటే కార్యక్రమానికి వచ్చి, హాస్టల్‌, వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్‌ వ్యవస్థను నెలకొల్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి విధి విధానాలను ప్రకటించింది. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఆవరణను పరిశుభ్రంగా ఉండేటట్లు చూడడం వంటి బాధ్యతలను అప్పగించింది. అయితే శ్రీకాకుళం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తన విధులను వదిలి వైద్యుల విధుల్లో అడ్మినిస్ట్రేటర్‌ తల దూర్చడం వలన వైద్యులు, అడ్మినిస్ట్రేటర్‌ మధ్య వివాదం రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ వైద్యురాలి సేవలను ఓ గదికి పరిమితం చేసి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తరహాలో పనిచేయిస్తుండడాన్ని ప్రశ్నించిన వైద్యులను, దీనిపై ప్రచురితమైన వార్త కథనాలను ఉద్దేశించి ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అడ్మినిస్ట్రేటర్‌ అనడాన్ని వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎవరి విధులు ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. తక్షణమే విధులను తెలియజేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని వైద్యులు రెండు రోజుల క్రితం డీఎంఈకి నివేదించి అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం వేచి చూస్తున్నారు.

రిమ్స్‌లో పనిచేస్తున్న ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ఇంజినీరింగ్‌ అధికారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత నెల 30వ తేదీన ఈఈగా పనిచేసిన సత్య ప్రభాకర్‌ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో విశాఖపట్నంలో క్వాలిటీ కంట్రోల్‌ డీఈ గా పనిచేస్తున్న ప్రమోద్‌ కుమార్‌ను ఇన్‌చార్జి ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అయితే ఆయన వారంలో మూడు నాలుగు రోజులు మాత్రమే శ్రీకాకుళం వస్తూ ఉండడం, తరచూ సెలవులు పెడుతూ ఉండడంతో ఇంజినీరింగ్‌ అధికారుల మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. ఇటీవల కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు, నీటిని తరచూ పరీక్ష చేయించడం లేదని వృథాగా వదిలేస్తున్నారని.. మరలా ఇదే గమనిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని డీఈని హెచ్చరించడంతో వివాదం ముదిరిపోయింది. ఆరోజు ఈఈ ఉన్నప్పటికీ కలెక్టర్‌కు ఎదురుపడకుండా ఉండటం వల్ల డీఈపై కలెక్టర్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. ఇలా బాధ్యత కలిగిన అధికారులు తప్పించుకుంటూ బాధ్యత లేని అధికారులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న ఆవేదన అటు వైద్యులు, ఇంజినీరింగ్‌ అధికారులతో పాటు మరికొందరు ఉద్యోగుల్లో ఉంది. ఇప్పటికై నా రాష్ట్ర అధికారులు స్పష్టత ఇవ్వకుంటే కేజీహెచ్‌ స్థాయిలోనే వివాదం ముదిరే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement