
పీహెచ్‌సీ వైద్యుల సమ్మె సైరన్
ఆన్‌లైన్ రిపోర్టుల నిలిపివేత
ఈ నెల 29 నుంచి ఓపీ విధుల బహిష్కరణ
వచ్చే నెల 3 నుంచి విజయవాడలో నిరాహార దీక్షలు
అరసవల్లి: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. ముందస్తు నోటీసులను ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులకు అందజేసి ప్రభుత్వ విధులను నిలిపివేసేలా సన్నద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో పీహెచ్‌సీ వైద్యుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం నుంచి నల్లబ్యాడ్జీలతోనే విధులు నిర్వర్తిస్తూనే అధికారిక ఆన్‌లైన్ విధులు, రోజువారీగా పంపించాల్సిన ఆన్‌లైన్ నివేదికలను కూడా నిలిపివేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో నిరసనల షెడ్యూల్ ప్రకారం నిర్వర్తించేలా చర్యలకు దిగారు. ఈ క్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి, కలెక్టరేట్‌కు కూడా సమ్మె నోటీసులను శుక్రవారం అందజేశారు. ఈ నెల 29 నుంచి ఓపీ సేవలను కూడా నిలిపివేసేలా నిర్ణయాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో పేద, సామాన్య వర్గాలకు ప్రభుత్వ వైద్యం దూరం కానుంది.
నిరసనల షెడ్యూల్ ఇలా....
●నేడు సంచార చికిత్సలు వంటి క్యాంపు విధుల బహిష్కరణ
●28న ప్రభుత్వ అధికారిక వాట్సాప్‌ల నుంచి
నిష్క్రమణ
●29 నుంచి ఓపీ(అవుట్ పేషంట్) సేవలు నిలుపుదల. ఎమర్జెన్సీ సర్వీసులైన డెలివరీలు, పాముకాటు, విషం తీసుకునే తదితర కేసులకు మాత్రమే అనుమతి.
●30న జిల్లా కేంద్రంలో నిరసన
●అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, వినూత్న నిరసన
●3న విజయవాడలో నిరాహార దీక్షలు ప్రారంభం