
అధికారుల తనిఖీలు..
నరసన్నపేటలో హోల్‌సేల్ షాపుల్లో సెంట్రల్ జీఎస్టీ అధికారుల తనిఖీలు
భయంతో షాపులు మూసేసిన వ్యాపారులు
వివరాలు వెల్లడించని అధికారులు
నరసన్నపేట : జిల్లాలో వ్యాపార కేంద్రమైన నరసన్నపేటలో కేంద్ర జీఎస్టీ అధికారులు శుక్రవారం రెండు బృందాలుగా ఏర్పడి హోల్‌సేల్ బంగారం షాపుల్లో మమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. డీసీ వర్మ ఆధ్వర్యంలో విశాఖ నుంచి వచ్చిన అధికారులు తమ్మయ్యపేటలో ఉప్పు గిరి నివాసం, ఆదివరపుపేట కూడలిలో మన్మధరావు హోల్‌సేల్ షాపులో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగాయి. మూడేళ్లుగా జరిగిన వ్యాపారం, కట్టిన టాక్స్‌లపై ఆరా తీసినట్లు సమాచారం. కొన్ని రికార్డులు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అధికారులు వివరాలు మాత్రం వెల్లడించలేదు. పన్ను ఎగవేత బంగారం పెద్ద మొత్తంలో గుర్తించినట్లు తెలుస్తోంది. కోయంబత్తూరులో హోల్‌సేల్ వ్యాపారి ఒకరు సెంట్రల్ జీఎస్టీ అధికారులకు పట్టుబడ్డారని, ఈయన ఇచ్చిన సమాచారం మేరకు నరసన్నపేటలో రెండు హోల్‌సేల్ షాపుల్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.
షాపులు మూసేసిన వ్యాపారులు..
జీరో బంగారం వ్యాపారం చేస్తూ అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మోసం చేస్తున్న నరసన్నపేటలోని పలువురు బంగారం వ్యాపారులు తమ గుట్టురట్టు అవుతుందనే భయంతో వెంటనే షాపులను మూసేశారు. షట్టర్లు దించి ఇళ్లకు వెళ్లిపోయారు. బంగారం వ్యాపారుల చర్యల పట్ల స్థానికులు విస్తుపోతున్నారు. జీఎస్టీ అధికారులు వస్తే షాపులు మూసేసి వెళ్తున్నారంటే వీరు చేస్తున్న వ్యాపారం అంతా మోసమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూలై 17న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బంగారు ఆభరణాలపై వేసిన నకిలీ హాల్‌మార్క్ వ్యవహరం వెలుగుచూసిన విషయం తెలిసిందే.