
సంబరాల సమయం
ఉత్సవాలకు ఏర్పాట్లు
పాతపట్నం:
నీలమణి దుర్గ ఆలయ సన్నిధిలో సంబరాలకు సమయం ఆసన్నమైంది. అమ్మవారిని జిల్లా వాసు లతో పాటు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు పూజిస్తారు. ఆలయానికి దాదాపు 350 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఈ పాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఒడి శా పర్లాకిమిడిలో ఉన్న మహారాజులు పరిపాలన కోసం ఈ ప్రాంతం నుంచి టెక్కలిలో ఉన్న కోటకు వెళ్లేవారని ప్రతీతి. 1674 సంవత్సరం ప్రాంతంలో పర్లాకిమిడిని పరిపాలిస్తున్న గజపతి మహారాజుకు చెందిన కూలీలు పొలం దున్నుతుండగా నాగలికి విగ్రహం తగిలి బయటపడిందని, రాజుకు అమ్మవారు కలలో కనిపించగా ఇక్కడ ప్రతిష్టించారనేది స్థల పురాణం.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతి రోజూ అమ్మవారు రోజుకో అవతారంలో కనిపిస్తారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు కుంకుమపూజ, కలశపూజ, అష్టోత్తర శతనామపూజలు జరుగుతాయని, సాయంత్రం 3 గంటలకు సహస్రనామపూజ, కుంకుమ పూజ ఉంటాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి.వాసుదేవరావు తెలిపారు.
దసరా రోజు వాహనాలకు ప్రత్యేక పూజలు
అమ్మవారి గుడి ప్రాంగణంలో కొత్తగా కొనుగోలు చేసిన రకరకాల వాహనాలతో పాటు, ఇతర వాహనాలకు దసరా రోజు ప్రత్యేక పూజలను నిర్వహిస్తామని, 22న బాలత్రిపుర సుందరిదేవిగా, 23న గాయత్రి దేవి, 24న అన్నపూర్ణదేవి, 25 కాత్యాయని దేవి, 26న మహాలక్ష్మి దేవి, 27న లలిత త్రిపుర సుందరి దేవి, 28న మహాచండి దేవి, 29న సరస్వతి దేవి (మూలనక్షత్రం), 30న దుర్గాదేవి (దుర్గాష్టమి), అక్టోబర్ 1వ తేదీన మహిషాసురమర్ధని, 2న రాజరాజేశ్వరిగా అలంకరణ ఉంటుందని తెలిపారు.
ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
22వ తేదీన సాయంత్రం రాగ సుధా మ్యూజికల్ ఆర్కెస్ట్రా, 23న భక్తి సంగీత విభావరి, అన్నమయ్య కీర్తనలు, 24న రాత్రి 6గంటలకు సినీ భక్తీ సంగీత విభావరి, 25న సాయంత్రం భక్తి సంగీత విభావరి, 26న భరత నాట్యం, కూచిపూడి నృత్య విభావరి, 27న శ్రీ సప్తగిరి సంగీత విభావరి, 28న రాత్రి 6 గంటలకు నరసన్నపేట వారి శ్రీ సీతారామ కల్యా ణం బుర్రకథ, 29న సాయంత్రం భక్తి సినీ సంగీత విభావరి, 30న రాత్రి 8 గంటలకు విజయనగరం వారిచే రేలారే రేలా, అక్టోబర్ 2న సాయంత్రం 5.30గంటలకు అమ్మవారి తిరువీధి, బాణాసంచా, కాళికవేషాలు, మేళతాళాలతో నిర్వహించనున్నారు.
పాతపట్నం నీలమణి దుర్గ దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి దేవదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పాతపట్నం సీఐ ఎన్.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కోసం పాతపట్నం, మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు విధులు అందించనున్నారు.
– టి.వాసుదేవరావు, కార్యనిర్వాహణాధికారి, పాతపట్నం

సంబరాల సమయం

సంబరాల సమయం