
కొత్తమ్మతల్లి జాతరకు సర్వం సిద్ధం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతరను 23, 24, 25 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయ న, జాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించా రు. జాతరకు భద్రతా పరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతర సందర్బంగా కొత్తపేట నుంచి కోటబొమ్మాళి వరకు రహదారి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్, సెంటర్ డివైడర్ అలంకరణ, విద్యుద్దీపాలు అమర్చినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బయో టాయిలెట్లు, ఆర్టీసీ బస్సులు, వైద్య శిబిరాలు, అన్నదానం, మజ్జిగ పంపిణీ, శోభా యాత్ర వంటి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.