
వంశధారలో మునిగి ప్రధానోపాధ్యాయుడు మృతి
నరసన్నపేట: గోపాలపెంట ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మార్పు నాగేశ్వరరావు (54) ప్రమాదవశాత్తూ వంశధారలో మునిగి మృతి చెందారు. ఇదే గ్రామంలో నాగేశ్వరరావు నివసిస్తుండగా కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వంశధార నదికి స్నానానికి వెళ్లిన ఆయన ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో భార్య రమణమ్మ, కుమారులు సునీల్, సుధీర్‌లు కుటుంబ సభ్యులు, స్థానికుల సహకారంతో పరిసరాల్లో గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయానికి ఒక చోట ఆయన వస్త్రాలు, చెప్పులు కనిపించచడంతో ప్రమాదవశాత్తూ నీట మునిగి ఉంటారని అనుమానించి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గాలించ గా నదిలో నీరు అధికంగా ఉన్న ఒక చోట మృతదేహాన్ని శనివారం సాయంత్రం గుర్తించారు. దీంతో ఒక్కసారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆయన ఇక్కడ మూడేళ్లుగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకుని గ్రామస్తులు కూడా కంట నీరు పెట్టారు. నాగేశ్వరరావు మృతిపై సర్పంచ్ ఎండ కృష్ణవేణి, ఎంపీటీసీ గదిలి మల్లేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు బొబ్బాది ఈశ్వరరావు, తోట భార్గవ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఘటనపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వంశధారలో మునిగి ప్రధానోపాధ్యాయుడు మృతి