
మందుబాబులకు సుఖీభవ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
జిల్లాలో వింత పరిస్థితి నడుస్తోంది. పేదల కుటుంబాలను నాశనం చేసే మద్యం ఎప్పుడు కా వాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత దొరుకుతోంది. ప్రభుత్వం దగ్గరుండి మరీ పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చింది. కానీ ఎరువు కావాలంటే మాత్రం నానా యాతన పడాల్సి వస్తోంది. గంటల కొద్దీ క్యూలో నిలబడినా బస్తా ఎరువు సర్కారు ఇవ్వలేకపోతోంది. పొలంలో పనులన్నీ మానుకుని చీటీల కోసం ఓ రోజు, ఎరువు కోసం మరో రోజు నిలబడినా దొరుకుతుందన్న గ్యారెంటీ లేకుండాపోయింది. ఈ రెండింటిలోనూ అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్న వైనాలు కనిపిస్తున్నా యి. ఒకవైపు యూరియాను పక్కదారి పట్టించి, బ్లాక్‌లో అమ్ముకుని లబ్ధి పొందుతుండగా, మరోవైపు ఎంఆర్‌పీకి మించి మద్యాన్ని అమ్ముతూ, ముడుపులు తీసుకుంటూ కోట్లలో ఆర్జిస్తున్నారు.
సంపాదనే ధ్యేయం..
రైతుల సమస్యలు, ప్రజల ఆరోగ్యం కూటమి ప్రభుత్వానికి, పాలకులకు పట్టడం లేదు. గుడి, బడి తేడా లేకుండా మద్యం షాపులు పెట్టి, పర్మిట్ రూమ్‌లను ప్రోత్సహించి, బెల్ట్‌షాపులు నడిపి ఫుల్‌గా జనాల్ని తాగిస్తున్నారు. ప్రజల ఆరో గ్యాన్ని దెబ్బతీసి దాని ముసుగులో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు, నెల వారీ ముడుపులు తీసుకుని రూ.కోట్లకు పడగలెత్తున్నారు. టార్గెట్‌లు పెట్టి, ఇంటికి దగ్గరలో సరఫరా చేసి మద్యం విక్రయాలను భారీగా పెంచుతున్నారు. ఏడాది కాలంలో 14లక్షలకు పైగా ఇండియన్ మేడ్ లిక్కర్ కేసులు, 4లక్షల 59వేల 81బీరు కేసులు విక్రయాలు జరిగాయంటే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో అర్థం చేసు కోవచ్చు.
రైతులపై శ్రద్ధ ఏదీ..?
ప్రభుత్వం మద్యం అమ్మకాలు, లాభాలు, ముడుపులపై చూపించిన శ్రద్ధ రైతులపై చూపించలేదు. యూరియా కొరత జిల్లాలో తీవ్రంగా ఉన్నా సంబంధిత ప్రజాప్రతినిధులు కనీసం నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా చేయలేదు. అరకొర యూ రియా సరఫరా చేసి తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు రైతులను క్యూలలో వదిలేశారు. జిల్లాలో 3,68,057మంది రైతులు ఉన్నారు. వరి, చెరుకు, మొక్కజొన్న, ప్రత్తి, పెసర, కంది తదితర పంటలు 4లక్షల ఒక వెయ్యి 472ఎకరాల్లో సాగుతున్నట్టు అధికారికంగా చూపించారు. ఇక, తోట పంటలైతే మరో లక్షా 20వేల వరకు వరకు ఉన్నాయి. వీటిన్నింటికీ 50వేల మెట్రిక్ టన్నులకు యూరియా అవసరం ఉంది. కానీ, ప్రభుత్వం చచ్చీ చెడీ సెప్టెంబర్ 19వ తేదీ నాటికి 30,646 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టు చెబుతోంది. కానీ ఇంకా రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. క్యూలలో పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యంతో అరకొర యూరియా వచ్చిందనుకుంటే దాన్ని కూడా పక్క దారి పట్టించి, బ్లాక్‌లో విక్రయించుకున్నారు. ఒక్కో నాయకుడు ఎంత దాచుకున్నారో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లే తేటతెల్లం చేశారు. మండల పరిషత్ సమావేశాల్లోనైతే ప్రతి పక్షాల సభ్యులు ఏకంగా నిలదీశారు.

మందుబాబులకు సుఖీభవ..